ప్రకాశం జిల్లాలో..
ఆస్తి పన్ను పెంచడం వల్ల సామాన్య ప్రజలపై భారం పడుతుందని.. ప్రకాశం జిల్లా పట్టణ పౌర సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఒంగోలు నగరపాలక సంస్థ ఎదుట పౌర సంఘాల ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో పలువురు మాట్లాడారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
కర్నూలు జిల్లాలో..
పెంచిన ఇంటి పన్నులను తగ్గించాలని కర్నూలులో పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. కరోనా సమయంలో నిత్యావసర ధరలు పెరిగి ఆదాయం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం ఇంటి పన్నులు పెంచటం సరికాదన్నారు. ప్రభుత్వం ఇంటి పన్నుల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
కడప జిల్లాలో..
ఆస్తి పన్ను పెంపు ప్రక్రియను నిలిపివేయాలని కడప జిల్లా మైదుకూరులో సీపీఎం నాయకులు పురపాలిక కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. తాగునీరు, పారిశుద్ధ్యం నిర్వహణపై చేసిన చట్ట సవరణకు సంబంధించిన ఉత్తర్వులు 196, 197, 198ని రద్దు చేయాలని నినాదాలు చేశారు. ప్రజలపై భారం మోపే విధానాలను విడనాడాలని కోరారు. కరోనా నేపథ్యంలో ఆస్తిపన్నుపై 50 శాతం రాయితీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థలకు రావాల్సిన గ్రాంట్లను వెంటనే విడుదల చేయాలని కోరారు.