ఉత్తరాంధ్ర ప్రాంతం.. మామిడి తోటలకు ప్రసిద్ది. ఇక్కడి మామిడికి దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. గతంలో ఇక్కడి నుంచి లారీలలో దిల్లీకి మామాడిని ఎగుమతి చేసేవారు. సుదీర్ఘంగా ఎండ వేడిమి తగిలి గమ్యం చేరే వరకే... మామడి సగం వరకూ పాడైపోయేవి. రైతులకు, వ్యాపారులకు తీవ్ర నష్టాలు వచ్చేవి. దీనికి పరిష్కారంగా కిసాన్ రైళ్లు ప్రత్యేకంగా మామిడికే నడిపేందుకు చర్యలు చేపట్టడం వల్ల పరిస్ధితిలో మార్పు కన్పించింది. కేవలం రోజున్నరలోనే ఉత్తరాంధ్ర నుంచి దిల్లీకి నేరుగా ఎలాంటి సమస్య లేకుండా చేరుతోంది.
రైల్వే మంత్రిత్వ శాఖ ద్వారా కిసాన్ రైలు రవాణా ఛార్జీలలో 50 శాతం రాయితీని కేంద్రం ఇస్తోంది. ఇప్పటివరకు కిసాన్ రైళ్ల ద్వారా 3.64 కోట్ల రూపాయల రవాణా ఛార్జీలు అయితే... అందులో 1.78 కోట్ల రూపాయలు సబ్సిడీగా అందించారు. గడచిన ఆర్థిక సంవత్సరంలో మామిడి సీజన్‌లో 20 కిసాన్ స్పెషల్ రైళ్లు నడిపితే.. ఈసారి 24 రైళ్లను రైల్వే శాఖ నడిపింది. దీని ద్వారా 4వేల 324 టన్నులు మామిడిని రవాణా చేసి..వాల్తేర్ డివిజన్ 1.88 కోట్ల రూపాయల అదాయాన్ని ఆర్జించింది. మిగిలిన పంటలు పండించే రైతులు కిసాన్ స్పెషల్ సేవలను వినియోగించుకోవాలని రైల్వే శాఖ పిలుపునిస్తోంది.