ప్రతిఏటా డిసెంబర్ నాలుగున జరిగే నౌకాదళ దినోత్సవం సందర్భంగా... తూర్పు నౌకాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ అతుల్‌కుమార్‌జైన్ మీడియా సమావేశం నిర్వహించారు. తూర్పునౌకాదళ ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో జరిగిన ఈ సమావేశంలో కొవిడ్‌లో నౌకాదళం నిర్వహించిన పాత్ర, విదేశాల నుంచి భారతీయులను తీసుకువచ్చిన ఆపరేషన్ల తీరును వివరించారు. పాక్, చైనాలు దేశ సరిహద్దుల్లో యుద్ధం చేస్తూ... అస్థిర పరిస్ధితులను కల్పిస్తున్నాయని, దీనిని ఎదుర్కోవడానికి జలమార్గంలో భారత నౌకాదళం సిద్ధంగా ఉందన్నారు.
హిందూ మహాసముద్ర ప్రాంతం వ్యూహాత్మకంగా, వాణిజ్యపరంగానూ అత్యంత కీలకమైన ప్రాంతమని ఇక్కడ ఉన్న ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొని నౌకాదళం క్షిపణి ప్రయోగాల్ని సమర్థంగా నిర్వహిస్తున్నామని జైన్ వివరించారు. బంగాళాఖాతంలో ప్రతిరోజూ దీపావళి మాదిరిగానే ఉందని పేర్కొన్నారు. రానున్న మూడునాలుగేళ్లలో సముద్రజలాల్లో రక్షణ కోసం కొత్తగా ఎయిర్‌క్రాఫ్ట్స్, సబ్మెరైన్లు, గస్తీ కోసం సమకూర్చుకుంటామని అతుల్‌కుమార్‌జైన్ స్పష్టం చేశారు. ఎక్కడైనా, ఎలాంటి సమయంలోనైనా వీటిని మోహరించడానికి, ప్రయోగించడానికి సిద్ధంగా ఉంటాయని చెప్పారు.