శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా విశాఖ అందరి దృష్టినీ ఆకర్షిస్తూ ఉంటుంది. అందుకే ఈ నగరంలో భూ సంబంధిత వివాదాలు అనేకం.. నిత్యం సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తూనే ఉంటాయి. తమకు నష్టం చేసే విధంగా ఏర్పడిన మస్యల పరిష్కారానికి పోలీసు శాఖ గడప తొక్కినా... అనేక సందర్భాల్లో పోలీసులు ఈ సమస్యల్లో కలగ చేసుకునే అవకాశాలు ఉండవు. ఇలాంటి అడ్డంకుల్ని అధిగమించి ప్రజలకు న్యాయం చేసే దిశగా విశాఖ పోలీసు కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా ... ప్రీ లిటిగేషన్ కౌన్సెలింగ్ ఫోరం-(పీఎల్సీఎఫ్) ఏర్పాటుకు చొరవచూపారు. రెవెన్యూ, జీవీఎంసీ, పోలీసు శాఖల అధికారులు ఇందులో ఓ కమిటీగా ఉంటూ ప్రతి బుధ, శుక్రవారాల్లో ప్రజల నుంచి సివిల్ తగాదాలకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరిస్తారు.
పరిష్కారమే లక్ష్యంగా..
ప్రధానంగా భూ తగాదాలు, కబ్జాలు వంటి సమస్యల్ని పీఎల్సీఎఫ్ పరిష్కరిస్తుంది. అంతే కాకుండా కుటుంబ వివాదాలు, ఇరుగు పొరుగువారితో ఇతర వ్యక్తులతో ఉన్న వివాదాలు వంటి వాటినీ, నగదు సంబంధిత లావాదేవీలను, రుణాలు, చిట్స్ వంటి వివిధ సమస్యలకు సైతం పరిష్కార మార్గాన్ని అధికారులు చూపించనున్నారు. ఫిర్యాదుల్ని కమిటీ పరిశీలించిన తరువాత అవసరం మేరకు లోక్ అదాలత్ కు పంపించి చట్టబద్ధంగా సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తారు.