Excavations at quarries in Visakha : విశాఖ జిల్లాలో క్వారీ తవ్వకాలు వాతావరణానికి పెనుముప్పుగా మారుతున్నాయి. నిర్వాహకులు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో చుట్టు పక్కల గ్రామస్థులు పలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. పెద్దఎత్తున వాహనాల రాకపోకలు సాగిస్తుండటంతో దుమ్ము, ధూళితో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దుల్లో ఉన్న ఈ క్వారీలవైపు అధికారులు కన్నెత్తి కూడా చూడకపోవడంతో స్థానికులకు తిప్పలు తప్పడం లేదు.
విశాఖ జిల్లా నాతవరం మండలంలోని బమిడికలొద్ది క్వారీలో ప్రతిరోజూ వేల క్యూబిక్ మీటర్ల లేటరైట్ తవ్వకాలు చేపడుతున్నారు. వందల టన్నులు కడప, కర్నూలు, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లోని సిమెంటు కంపెనీలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో క్వారీ ప్రాంతం నుంచి దారి పొడువునా పరిసరాలన్నీ కాలుష్యమైపోతున్నాయి. నీటి వనరులు దెబ్బతినడంతో పాటు ఇళ్లల్లోకి దుమ్ము, ధూళి వచ్చి చేరుతున్నాయి.
ఇదీ చదవండి:పంచాయతీల్లో తాగునీటి పథకాల నిర్వహణ అస్తవ్యస్తం
Quarries Pollution in Visakha : లేటరైట్ తవ్వకాలు స్థానిక గ్రామాల ప్రజలకు అనారోగ్య సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. బమిడికలొద్ది కొండపై ఇప్పటికే 121 హెక్టార్లలో లేటరైట్ తవ్వడానికి, తరలించడానికి క్వారీ నుంచి భారీ రహదారి నిర్మాణం చేపట్టారు. ఎలాంటి అనుమతులూ తీసుకోకుండానే వేలాది చెట్లు నేలకూల్చారని విమర్శలూ వచ్చాయి. తాజాగా లేటరైట్ రవాణాతో కాలుష్యం కారణంగా రహదారి పక్కనున్న పచ్చని వనాలన్నీ ఎర్రగా మారిపోయాయి. పూతతో కళకళలాడాల్సిన జీడిమామిడి తోటలు... ఎర్రటి మట్టితో నిండిపోయి కాపు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. దుమ్ము, ధూళి వల్ల శ్వాస సంబంధిత వ్యాధులు వస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు.
"ఈ తవ్వకాలతో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. దుమ్ము ధూళి నిండి శ్వాసకోశ పరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇరుకు రోడ్లపైనే లారీలతో తవ్విన వాటిని తరలిస్తున్నారు. దుమ్ము ధూళి ఇళ్లలోకి చేరి మాకు ఆరోగ్య పరమైన సమస్యలు వస్తున్నాయి. చిన్న వయసులోనే ఆయాసం, దగ్గు,ఊపిరితిత్తుల్లో సమస్యలు తలెత్తుతున్నాయి. మందులు వాడినా ఫలితం కనిపించడం లేదు."- సన్యాసమ్మ , పైడిపాల గ్రామం