ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సర్కారీ కొలువులు సాధిస్తున్న అడవి బిడ్డలు - విశాఖ జిల్లా తాజా వార్తలు

బయటి ప్రపంచంతో కలవలేనంత దూరం వారిది. సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ చేరని మారుమూల ప్రాంతాలవి. ఇన్ని సవాళ్ల మధ్య ఎలాగో కాస్త చదివినా.. ఉపాధి అంతంతమాత్రమే. ఇప్పుడు పరిస్థితి మారింది. పోలీసుశాఖ చేయూత.. జీవితాలను మలుపు తిప్పింది. అమాయక అడవి బిడ్డలు.. సర్కారీ కొలువులు కొల్లగొట్టారు. ఒక్క విశాఖ మన్యం నుంచే 32 మంది ఉద్యోగాలు సాధించి సత్తా చాటారు.

Police Spurthi
Police Spurthi

By

Published : Mar 20, 2021, 10:13 AM IST

Updated : Mar 20, 2021, 10:28 AM IST

సర్కారీ కొలువులు కొల్లగొట్టిన అడవి బిడ్డలు

సరైన ఉపాధి లేక నక్సలిజం, గంజాయి రవాణా లాంటి పెడ ధోరణుల బారిన పడుతున్న విశాఖ మన్యం యువత జీవితాల్లో కొత్త వెలుగులు నిండాయి. 'స్ఫూర్తి' పేరుతో విశాఖ జిల్లా పోలీసులు చేపట్టిన శిక్షణ కార్యక్రమం సరికొత్త మార్పు తెచ్చింది. 2018లో 'స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌' చేపట్టిన ఉద్యోగాల భర్తీలో.. మన్యం ప్రాంతం నుంచే ఏకంగా 32 మంది ఉద్యోగాలు సాధించారు. వారిలో నలుగురు అమ్మాయిలూ ఉన్నారు. నాడు కరోనా కారణంగా నిలిచిన నియామక ప్రక్రియ ఫలితాలు తాజాగా వెల్లడయ్యాయి.

ఐటీడీఏ ఆర్థిక సహకారంతో పోలీసులు చేపట్టిన కార్యక్రమం ద్వారా.. రెండు విడతల్లో 112 మంది గిరిజన యువత కేంద్ర పారామిలటరీ బలగాల్లో ఉద్యోగాలు పొందారు. ఆన్‌లైన్‌ పరీక్షపై అవగాహన లేని వారిని.. నాణ్యమైన శిక్షణ సంస్థల ద్వారా పోలీసులు సానబట్టారు. హైదరాబాద్‌ నుంచి నిపుణులను రప్పించి.. గణితం, ఆంగ్లంపై 45 రోజుల శిక్షణ ఇచ్చారు. శరీర దారుఢ్యం పెంచేలా పోషకాహారం సహా.. విశాఖ, తిరుపతి, విజయవాడ వెళ్లి పరీక్షలు రాసేందుకు అవసరమైన ప్రయాణ, వసతి ఖర్చులు సమకూర్చారు. ఆ ప్రయత్నాలన్నీ ఫలించి ప్రభుత్వ ఉద్యోగులుగా గిరిజన యువత ఎదిగారు.

కేంద్ర బలగాల్లోని సీఆర్​పీఎఫ్, బీఎస్​ఎఫ్, ఎస్​ఎస్​బీ, సీఐఎస్​ఎఫ్ విభాగాల్లో దేశవ్యాప్తంగా ఎస్టీ కేటగిరిలో వేల సంఖ్యలో ఖాళీలు ఉంటున్నాయి. విశాఖ మన్యంలోని గిరిజన యువతకు ఆయా పరీక్షలపై అవగాహన లేక, కనీసం దరఖాస్తూ చేయలేని పరిస్థితి ఉండేది. ఏటా వేల పోస్టులు బ్యాక్‌లాగ్‌లుగా మిగిలిపోతున్నాయి. ఆయా ఉద్యోగాలను అందిపుచ్చుకొనేలా తోడ్పడితే మన్యం అభివృద్ధి చెందుతుందన్న లక్ష్యంతో.. ఐటీడీఏతో కలిసి పోలీసులు 'స్ఫూర్తి' కార్యక్రమం ప్రారంభించారు. గిరిజన యువత కోసం.. స్ఫూర్తి సహా ప్రేరణ, సాధన, ముందడుగు లాంటి అనేక కార్యక్రమాలను పోలీసులు నిర్వహించారు.

ఇదీ చదవండి:'బ్యాంకులను ప్రైవేటీకరించినా..సాగు రుణాలకు ఇబ్బంది లేదు'

Last Updated : Mar 20, 2021, 10:28 AM IST

ABOUT THE AUTHOR

...view details