విశాఖ నగరంలోని పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన పలు చోరీ కేసులను పోలీసులు ఛేదించారు. ఈ దొంగతనాలకు సంబంధించి ఆరుగురు పాతనేరస్తులను అరెస్టు చేశారు. ఈమేరకు విశాఖ సీటీ క్రైం డీసీపీ వి. సురేశ్ బాబు వెల్లడించారు. మొత్తం 7 కేసుల్లో 140 గ్రాముల బంగారు ఆభరణాలు, ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
శుక్రవారం గాజువాకలో తుక్కు అమ్ముతామని చెప్పి తుక్కు వ్యాపారం చేసే వృద్ధ దంపతులపై దాడి చేసి దోపిడీకి పాల్పడ్డ ఘటనలోనూ ఇద్దరిని అరెస్టు చేశారు. నగరంలో పటిష్ఠ నిఘాని ఏర్పాటు చేశామని.. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీసీపీ సురేశ్ బాబు హెచ్చరించారు.