విశాఖ విషవాయువు విషాదంపై జనంలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బాధిత కుటుంబాలు ఆక్రోశంతో రగిలిపోయాయి. మృతదేహాలతో సహా వారు ఎల్జీ పాలిమర్స్ సంస్థ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. పరిశ్రమను తమ ఊరి నుంచి తరలించాలని నినాదాలతో హోరెత్తించారు. ఊరిజనమంతా ఒక్కసారిగా సంస్థ ప్రాంగణంలోకి చొచ్చుకెళ్లగా ఓ దశలో పరిస్థితులు చేయి దాటిపోయే పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో పరిశ్రమను సందర్శించిన డీజీపీ గౌతం సవాంగ్‌కు సిబ్బంది ఆయుధాలతో సహా రక్షణ వలయంగా ఏర్పడాల్సిన పరిస్థితి నెలకొంది.
కట్టలు తెగిన ఆగ్రహం
ఒక్క ఘటనతో ఊరిని వల్లకాడులా మార్చేశారని.. స్థానికులు నిప్పులు చెరిగారు. పచ్చగా ఉన్న గ్రామాలను పనికిరాకుండా చేశారని మండిపడ్డారు. న్యాయం అడిగినందుకు... అరెస్టు చేయడం ఏంటని నిలదీశారు.
పరిశ్రమ స్పందించదా..?
ఇంత ఘోరం జరిగినా పరిశ్రమ తగిన రీతిలో స్పందించలేదని స్థానికులు రగిలిపోతున్నారు. యాజమాన్యం తరఫున బాధితులకు ఇంత వరకూ ఒక్క సమాచారం లేదన్నారు. కనీసం గ్రామాల్లోకి వచ్చి కూడా చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి ప్రమాదకర గ్యాస్ లీకైతే.. వాసనను బట్టి తమను తాము రక్షించుకున్నామే కానీ.. సంస్థ నుంచి కనీసం ఎవరూ అప్రమత్తం చేయలేదని మండిపడ్డారు. గాలి, నీరు కలుషితం అయితే కనీసం పరీక్షలు జరిపించలేదన్నారు. మూడు రోజులుగా ఐదు గ్రామాల ప్రజలు బయట తలదాచుకుంటుంటే.. వారు ఉండటానికి చోటు కూడా పరిశ్రమ చూపించలేదని.. స్వచ్చంద సంస్థలు ఆహరం పెట్టాయి కానీ.. కనీసం కంపెనీ బాధితుల కడుపు నింపే ప్రయత్నం కూడా చేయలేదని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం స్పందించదా..?