విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం అన్నవరంలో దివీస్ యాజమాన్యం నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసింది. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి, పర్యటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, విశాఖ నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా పాల్గొన్నారు. సరుకుల పంపిణీ అనేసరికి అక్కడుండే స్థానికులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. వస్తువులు ఉచితంగా ఇస్తున్నారన్న ఆలోచన తప్ప ఆరోగ్యం మాట మరిచారు. వ్యక్తిగత దూరం పాటించడాన్ని పక్కనబెట్టారు.
ఒక్కరి నిర్లక్ష్యం.. తప్పదు భారీ మూల్యం - విశాఖలో మంత్రుల ప్రోగ్రామ్ లో వ్యక్తగత దూరం లేదు
అసలే కరోనా కాలం. పైగా విశాఖ జిల్లా రెడ్‌జోన్. అంతకంతకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. పేదలకు నిత్యావసరాలు అందించేందుకు విశాఖ అన్నవరంలోని దివీస్ సంస్థ ముందుకొచ్చింది. సరకుల పంపిణీకి పాలకపక్షం ఓ కార్యక్రమం ఏర్పాటుచేసింది. సభలో ప్రజాప్రతినిధులు, అధికారులు దూరంగానే కూర్చున్నారు. ఇప్పటి వరకూ అంతాబాగానే ఉంది. ఉచితంగా సరకులు అందిస్తున్నారని జనం పెద్ద సంఖ్యలో గుమిగూడారు. వ్యక్తిగత దూరాన్ని మరిచిపోయారు. కరోనా కట్టడికి వ్యక్తిగత దూరం పాటించాలని వైద్యులు చెబుతున్నా అవేవీ పాటించలేదు. ఏ చిన్న పొరపాటు జరిగినా కరోనా వ్యాప్తి చెంది మరింత హాట్‌స్పాట్‌గా మారే ప్రమాదం ఉందన్న సంగతి మరిచారు.
పరిస్థితి అదుపుతప్పడం వల్ల నిత్యావసరాలు ఇంటింటికీ పంపిణీ చేస్తామని చెప్పి జనాన్ని పంపించేశారు ఆ సంస్థవారు. గుమిగూడిన ఆ జనంలో ఏ ఒక్కరికి కరోనా ఉన్నా మిగిలిన వారి పరిస్థితి ఏంటి? గ్రామీణులు, అంతగా చదువుకోని వారు ప్రాంతాల్లోనే వారే వ్యక్తిగత దూరం పాటిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తుంటే... పేరుగాంచిన నగరాలు, పట్టణాల్లో నివసిస్తున్న మనం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నామా? రెడ్ జోన్‌గా ఉన్న విశాఖలో మరింత అప్రమత్తంగా ఉండాల్సింది పోయి.. కరోనా వ్యాప్తికి కారకులౌదామా? లేదా బాధ్యతతో మెలిగి కరోనాను కట్టడి చేద్దామా? ఆలోచించండి.
ఇదీ చదవండి :పేదల ఆకలి తీరుస్తున్న భారత్ వికాస్ పరిషత్