ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అడుగు బయటపెట్టాలంటే.. అవి తప్పక ఉండాల్సిందే! - wearing mask is must in telangana

కరోనా ఇక లేదు.. రాదు అనే రీతిలో జనంలో నిర్లక్ష్యం పెరిగిపోయింది. వైరస్ వ్యాప్తిని నిలువరించే మాస్క్‌లు పెట్టుకుని తిరిగేవారు అరుదుగా కనిపిస్తున్నారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి భయం లేకుండా మాస్క్‌ను పక్కన పెట్టి తిరుగుతున్నారు. మరోవైపు మళ్లీ కరోనా భూతం భయపెడుతోంది. రోజు రోజుకూ దేశంలో కొవిడ్ మహమ్మారి కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. మరోసారి లాక్ డౌన్ తప్పదు అనే ప్రచారమూ జరుగుతోంది. అయినా ప్రజల్లో మాస్క్ ధరించటంలో అదే ఆలసత్వం. ఏమి కాదనే నిర్లక్ష్య వైఖరి కనిపిస్తోంది. ఎవరిలోనూ కేసులు పెరుగుతున్నాయని.. కరోనాతో ప్రమాదం పొంచి ఉందనే భయం కనిపించటం లేదు. మళ్లీ మహమ్మారి బారిన పడకుండా మాస్క్ ధరించి అప్రమత్తంగా ఉండాలనే ఆలోచన రావటం లేదు.

penalty-for-those-who-failed-to-wear-mask-in-telangana-due-to-corona-crisis
అడుగు బయటపెట్టాలంటే.. అవి తప్పక ఉండాల్సిందే!

By

Published : Mar 25, 2021, 7:36 PM IST

అడుగు బయటపెట్టాలంటే.. అవి తప్పక ఉండాల్సిందే!

కర్ణుడికి కవచకుండలాలు మాదిరి ప్రతి ఒక్కరి ముఖానికి మాస్క్‌, చేతిలో శానిటైజర్‌ బాటిల్‌. అవసరం ఏదైనా... అడుగుపెట్టే ప్రదేశం ఎలాంటిదైనా... మాస్క్ ఉంటేనే ఇంటి నుంచి కాలు బయటపెట్టేవారు. చివరకు... ఇంట్లో ఉన్నా మాస్క్ ధరించే పరిస్థితి. ఇదంతా సరిగ్గా ఏడాది కిందటి మాట. ఎక్కడ చూసినా...ఎవరిని చూసినా...మాస్క్‌లే దర్శనం ఇచ్చేవి. కనీవినీ ఎరుగని రీతిలో యావత్తు ప్రపంచం మాస్క్‌ అనే ముసుగు ధరించింది. కాలచక్రం గిర్రున తిరిగి 2020 నుంచి 2021లోకి రాగానే...పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. మహమ్మారి సమస్య గతంలో మాదిరి వెంటాడుతూనే ఉన్నా...ప్రజలు మాత్రం మాస్క్ ధరించేందుకు ససేమిరా అంటున్నారు.

ఆ సంగతే మరిచారు..

దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు విజృంభిస్తున్నా...ఏ మాత్రం ఆందోళన, అప్రమత్తత లేకుండా జీవనం సాగిస్తున్నారు...ప్రజలు. ప్రపంచంపై పగపట్టిన విధంగా మళ్లీ మళ్లీ వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రధాన ఆయుధం..మాస్క్‌. అత్యంత కీలకమైన ఈ అస్త్రం లేకుండానే కొవిడ్‌ 19కు ఎదురెళ్లే సాహసం చేస్తున్నారు....దేశ ప్రజలు. కరోనా నుంచి దేశాన్ని కాపాడేందుకు విధించిన లాక్‌డౌన్‌కు ఇటీవలే ఏడాది పూర్తైంది. కొద్ది నెలలుగా అన్ని కార్యకలాపాలు యథావిథిగా సాగుతున్నా.. ఇంకా మహమ్మారి బెడద తొలగిపోలేదు. పూర్తిగా కొవిడ్‌ విషవలయం నుంచి బయటపడలేదు. కానీ ప్రజలు మాత్రం కరోనా వైరస్ అనేది ఒకటి ఉందనే విషయాన్నే మరిచిపోయిన రీతిలో..నిబంధనలకు విరుద్ధంగా నడుచుకుంటున్నారు. కనీసం మాస్క్ ధరించేందుకు సైతం విముఖత చూపుతున్నారు.

వారితో ప్రమాదమే!

వైరస్‌ వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి సుమారు పది నెలలపాటు అంతా విధిగా మాస్క్‌ ధరించారు. గత రెండు నెలలుగా మాత్రం చాలా మంది మాస్క్‌ను పక్కన పెట్టి...మహమ్మారికి మళ్లీ స్వాగతం పలికేలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం కేసులు భారీగా తగ్గడమే. అయితే పాజిటివ్‌ కేసులు తక్కువ నమోదవుతున్నాయే తప్ప...పూర్తిగా తగ్గలేదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొంతమంది వైరస్‌ బారినపడినప్పటికీ...వారిలో ఉండే వ్యాధి నిరోధక శక్తి వల్ల లక్షణాలు కనిపించకుండా వుండే అవకాశముంది. అటువంటి వారితో మాస్క్‌ లేకుండా మాట్లాడడం, చేతులు కలపడం వల్ల ఇతరులు వైరస్‌ బారినపడే ప్రమాదముంది. ఈ విషయాన్ని ఎవరూ గుర్తించటం లేదు.

అలసత్వపు ధోరణి..

బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్‌ ధరించడం వల్ల వైరస్‌ నుంచి మనల్ని మనం రక్షించుకునేందుకు అవకాశముంది. అయితే చాలామంది ఈ విషయంపై ఎలాంటి శ్రద్ధ చూపటం లేదు. బస్సులు, ఆటోల్లో మాస్క్‌ ధరించకుండా ప్రయాణాలు సాగిస్తున్నారు. ఒక ఊరి నుంచి మరొక ఊరికి వాహనాల్లో ప్రయాణించేటప్పుడు వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారితో దగ్గరగా మసలేందుకు ఆస్కారం ఉంది. అటువంటి సమయంలో వారి ముక్కు, నోటి నుంచి వెలువడే తుంపర్ల ద్వారా వైరస్‌ సోకవచ్చు. అదే మాస్క్‌ ధరించినట్టయితే ఈ విధంగా వ్యాప్తి చెందే వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు అవకాశం ఉంటుంది. అవగాహన ఉన్నా...ఈ అంశంపై ఎవరూ ఆసక్తి చూపటం లేదు. ఇంకెక్కడి కరోనా అనే అలసత్వపు ధోరణితో.. మళ్లీ మహమ్మారి వ్యాప్తికి కారణవుతున్నారు.

ఆలకించే వారే లేరు..

గత మార్చి నుంచి నిన్న మెున్నటి వరకూ నిరంతరం మాస్క్‌ వేసుకుని ఎంతో జాగ్రత్తగా ఉన్న ప్రజలు..ఇప్పుడు మాత్రం పూర్తిగా వాటికి చరమగీతం పాడి...ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన ఈ తరుణంలో మరికొద్దిరోజుల పాటు కొవిడ్ నిబంధనల్లో భాగమైన మాస్క్‌ ధరించటం, భౌతికదూరం పాటించటం, శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవటం వంటి వాటిని పాటించడం ద్వారా కరోనా నుంచి పూర్తి రక్షణ పొందేందుకు అవకాశం ఉంది. ఇదే విషయాన్ని వైద్య నిపుణులు సూచిస్తున్నా...వారి మాటల్ని ఆలకించేవారు కనిపించటం లేదు.

సెకండ్ వేవ్ మొదలైందా..

సెకండ్‌ వేవ్‌ వచ్చేసిందన్న ప్రచారం సాగుతున్న నేపథ్యంలో...కొవిడ్‌ వైరస్‌ వ్యాప్తిని నియంత్రించడంలో ప్రధానమైన మాస్క్‌ను ధరించడంలో ప్రజలు పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. కొంతకాలం కిందట కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన తరువాత ఇది మరింత పెరిగిపోయింది. అయితే ఈ ధోరణి చాలా ప్రమాదకరమని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీగా కరోనా కేసులు వెలుగులోకి రావడమే కాకుండా...తెలుగు రాష్ట్రాల్లో సైతం కొత్త కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొవిడ్‌ వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే అవకాశం ఉందన్న విషయం అందరూ గ్రహించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ తీసుకునేంత వరకూ గతంలో మాదిరిగానే అప్రమత్తంగా ఉండాలని, నియంత్రణ మార్గాలను పక్కాగా పాటించాలని సూచిస్తున్నారు.

అప్రమత్తత అవసరం..

మరోవైపు ఇప్పటికే వ్యాక్సినేషన్‌ ప్రారంభమైంది. కొంతకాలం ఆగితే ప్రతి ఒక్కరికీ అందుతుంది. వ్యాక్సిన్‌ రెండో డోసు తీసుకున్న తరువాత...వైరస్‌ను తట్టుకునే సామర్థ్యం శరీరంలో అభివృద్ధి చెందుతుంది. అప్పటివరకూ మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలని ...లేకుంటే పెను ప్రమాదం తప్పదంటున్నారు... నిపుణులు. టీకా ప్రతి ఒక్కరికి అందేవరకూ ప్రజలంతా సామాజిక బాధ్యతతో మాస్క్‌ ధరించటమే కాకుండా... కుటుంబంలోని చిన్నారులు, వృద్ధులు సైతం మాస్క్‌ వినియోగించేలా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

ఇదీ చదవండి:

భారత్ బంద్​ను విజయవంతం చేయండి: అచ్చెన్నాయుడు

ABOUT THE AUTHOR

...view details