ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

FISHERMEN PROTEST: రగులుతున్న రింగు వలల వివాదం.. రోడ్డెక్కిన మత్స్యకారులు - పెద్దజాలరిపేట మత్స్యకారుల ధర్నా

pedhajalaripet FISHERMEN PROTEST
pedhajalaripet FISHERMEN PROTEST

By

Published : Jan 5, 2022, 4:28 PM IST

Updated : Jan 5, 2022, 9:29 PM IST

16:25 January 05

FISHERMEN PROTEST IN VISAKHA DISTRICT

FISHERMEN PROTEST: విశాఖ జిల్లాలో మత్స్యకారుల మధ్య వలల వివాదం కొనసాగుతూనే ఉంది. నిన్న చెలరేగిన రింగువలల వివాదంపై చర్చలకు పిలిచి తమ వారిని అరెస్టు చేశారంటూ పెద్దజాలరిపేట మత్స్యకారులు ఆందోళనకు దిగారు. ఒకవైపు చర్చలకు పిలిచి.. మరోవైపు తమ వాళ్లను అరెస్టు చేశారని మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రింగ్‌ వలలను నిషేధించాలని డిమాండ్‌ చేస్తూ రహదారిపై బైఠాయించారు.

ఆందోళనకారులతో.. ఏసీపీ మూర్తి చర్చలు జరిపినప్పటికీ ఫలితం లేకపోయింది. తమవాళ్లను విడుదల చేస్తేనే చర్చలకు వెళ్తామని మత్స్యకారులు స్ఫష్టం చేశారు. రింగు వలలు ఉన్నవారు లక్షలు సంపాదిస్తున్నారన్న మత్స్యకారులు.. తమకు ఆదాయం లేకుండా చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తరువాత పెద్దజాలరిపేటకు చెందిన నూకన్న, సత్యారావును పోలీసులు విడిచిపెట్టడంతో మత్స్యకారులు ఆందోళన విరమించారు. రింగ్ వలలను నిషేధించాలని.. రింగ్ వలలతో 8 కి.మీ. లోపల వేటాడినా మాకు నష్టమేనని మత్స్యకార నేత పిల్లా నూకన్న అన్నారు.

"మత్స్యకారుడు సముద్రంలోకి వెళ్లవద్దనే సెక్షన్లు ఏంటి? రింగు వలల విషయంలో కోర్టు చెప్పినట్లు వింటాం. రింగు వలలు ఉన్నవారు లక్షలు సంపాదిస్తున్నారు. రింగు వలల వల్ల మాకు ఆదాయం లేకుండా చేస్తున్నారు'' - శెట్టి రాజు, మత్స్యకార నేత

పెద్దజాలరిపేట కూడలి వద్ద నిరసన చేపట్టారు. దీంతో.. పెద్దజాలరిపేటకు వెళ్లే రోడ్లను పోలీసులు ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా మూసివేశారు. పెద్దవాల్తేరు బస్ డిపో రోడ్డుపై మత్స్యకారులు ధర్నాకు దిగారు. రింగు వలలపై నిన్న ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. దీనికి సంబంధించి.. సముద్రంలో 6 బోట్లను కొందరు మత్స్యకారులు తగులబెట్టడంతో వివాదం మరింత ముదిరింది.

వివాదంపై మంత్రుల మాట.. ఇలా..

''జిల్లాలో మత్స్యకారులు సమన్వయంతో చేపల వేట సాగించుకోవాలి. చట్ట పరిధిలో నియమ నిబంధనలను అనుసరిస్తూ అందరికీ ఆమోదయోగ్యంగా ముందుకెళ్లాలి. పొరపొచ్చాలు ఇప్పుడే ఎందుకు వచ్చాయో ఆలోచించండి. మెరైన్ ఫిషరీస్ రెగ్యులర్ యాక్ట్ ప్రకారం బోట్లున్నవారు అనుమతి పొందాలి. రాష్ట్ర పరిపాలన రాజధానిగా రూపొందే విశాఖను గతంలోలా శాంతియుతంగా ఉంచాలి.'' - సీదిరి అప్పలరాజు,రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి

''మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. ఇబ్బందులను అధికారులకు తెలియజేయాలిగాని చట్టాన్ని చేతుల్లోకి తీసుకోరాదు. పోలీసులు సమన్వయంతో పికెటింగ్ కొనసాగుతుంది. హింస వలన సమస్యలు పరిష్కారం కాదు. చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుంది.'' - ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పర్యాటక శాఖ మంత్రి

అసలు ఏమిటీ వివాదం..?
సాధారణంగా మూడు రకాల బోట్లపై చేపల వేట సాగిస్తారు. సంప్రదాయ మత్స్యకారులు తెప్పలు, మరికొందరు ఇంజిను బోట్లు, ఇంకొందరు మరపడవలను ఉపయోగిస్తారు. మరపడవలు తీరం నుంచి 15కిలోమీటర్లు పైబడి, తెప్పలు, ఇంజిను బోట్లు 5 కిలోమీటర్ల పరిధిలో వేట సాగిస్తాయి. జిల్లాలో ఒకప్పుడు 132 రింగు వలలకు అనుమతులు ఇచ్చారు. వీటిలో 52 వలలు విశాఖ చేపల రేవు నుంచి పాయకరావుపేట తీరం వరకు ఉన్నాయి. వారికి లైసెన్సులు ఉన్నప్పటికీ రింగు వలలు వాడడం లేదు. మిగిలిన 80 వలలు ఎండాడ, మంగమారిపేట, భీమిలి మత్స్యకారుల వద్ద ఉన్నాయి. వీటిలో 19 వలలకు మాత్రమే అధికారిక అనుమతులు ఉన్నాయి.

కానీ.. లైసెన్సులు ఉన్నవాటి కంటే ఎక్కువగా రింగు వలలను వినియోగిస్తూ ఎండాడ, మంగమారిపేట, భీమిలి మత్స్యకారులు వేట సాగిస్తున్నారనేది ఆరోపణ. వీరిని చినజాలరిపేట, పెద జాలారిపేట మత్స్యకారులు అడ్డుకుంటున్నారు. గత ఏడాది జూన్‌లో తొలిసారి వివాదం చెలరేగింది. అప్పటిలో పోలీసు, రెవెన్యూ, మత్స్యశాఖ అధికారులు జోక్యం చేసుకొని వివాదాన్ని చల్లబర్చారు. కొన్నాళ్ల పాటు వేటను నిషేధించారు. ఆర్డీఓ కోర్టులో ఇరువర్గాలపై కేసులు నమోదు చేసి బైండోవరు చేశారు.

ఫలించని ప్రజాప్రతినిధుల చర్చలు..
గతేడాది జులై నెలలో రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు గవర్నర్‌ బంగ్లాలో రెండు వర్గాలతో సమావేశమై చర్చలు జరిపినా.. అవి అంతగా ఫలించలేదు. మళ్లీ ఆగస్టు 28న కలెక్టరేట్‌లో మంత్రి సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌, మత్స్యశాఖ కమిషనర్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొని ఇరువర్గాలను శాంతిపర్చే ప్రయత్నాలు చేశారు. హైకోర్టు తీర్పును అమలు చేయాలని మంత్రి మత్స్యకార వర్గాలకు సూచించి మిన్నకుండిపోయారు.

మళ్లీ సెప్టెంబరు నుంచి రింగు వలలతో వేట ప్రారంభమవడంతో పలుమార్లు ఘర్షణలు జరిగాయి. దీంతో వాటిని నిషేధించాలని కోరుతూ మత్స్యకారులు ధర్నాలు చేశారు. కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. నవంబరు 2న జీవీఎంసీ నుంచి కలెక్టరేట్‌ వరకు 28 మత్స్యకార గ్రామాలకు చెందిన వారు భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. డిసెంబరు నెలలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ను కార్యాలయం వద్ద కొంతమంది మత్స్యకారులు ఆందోళనకు దిగారు. మత్స్యశాఖ అధికారులను దాదాపు 12సార్లు కలిసి వినతులు అందజేశారు.

హైకోర్టు ఆదేశాలు ఏం చెబుతున్నాయంటే..?
రింగు వలల వివాదం రాష్ట్ర హైకోర్టు వరకు వెళ్లింది. దీనిపై గత ఏడాది మే నెలలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ వలలు వినియోగించే ఇంజిను బోట్లు తీరం నుంచి 8 కిలోమీటర్లు దాటి వేట సాగించాలని ఆదేశించింది. కొత్తగా అనుమతులు, పునరుద్ధరణ చేయవద్దని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను పాటించకుండా కొందరు తీరం నుంచి 3 కిలోమీటర్ల లోపు రింగు వలలను వినియోగిస్తూ వేట సాగిస్తుండడం వివాదానికి కారణమవుతోంది.

అనుమతులు తప్పనిసరి..
బోట్ల నిర్వాహకులు ఎటువంటి వలలు వాడినా మత్స్యశాఖ అభివృద్ధి అధికారి (ఎఫ్‌డీవో) నుంచి అనుమతులు తీసుకోవాలి. ఆయా వలలను చూపించి నిర్ణీత రుసుమును చెల్లించి లైసెన్సు పొందాలి. ఆరేడేళ్ల క్రితం అనుమతులు ఇచ్చిన రింగు వలలనే ఇప్పుడు వాడుతున్నారు. గత రెండేళ్ల నుంచి కొత్త వాటికి మత్స్యశాఖ అనుమతులు ఇవ్వడం లేదు.

ఇదీ చదవండి:టిక్కెట్‌ లేని ప్రయాణికులకు రూ.2.05 కోట్ల జరిమానా..

Last Updated : Jan 5, 2022, 9:29 PM IST

ABOUT THE AUTHOR

...view details