విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై వైకాపా నాయకులు చేస్తున్న నిరసనలు కేవలం ఎన్నికల స్టంటేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఆ పార్టీకి చెందిన 22 మంది ఎంపీలకు రాష్ట్రం పట్ల నిజంగా చిత్తశుద్ధి, ప్రేమ ఉంటే.. స్టీల్ ప్లాంటు కోసం వారు ఏం చేస్తారో? వారి విధానం ఏమిటో పార్లమెంటులో చెప్పాలని డిమాండ్ చేశారు. దిల్లీలో మాట్లాడేందుకు భయపడి ఏపీలో మాత్రం ఓట్ల కోసం నిరసన ప్రదర్శనలు చేస్తుంటే నమ్మటానికి ప్రజలెవ్వరూ సిద్ధంగా లేరన్నారు. ఆదివారం ఆయన ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ‘‘దిల్లీలో వదిలేసి.. విశాఖలో నిరసనలు చేయటం చూస్తుంటే వైకాపాకు చిత్తశుద్ధి లేదని అర్ధమవుతోంది.
విశాఖ ఉక్కు ఉద్యమాన్ని వైకాపా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాలి. విశాఖపట్నం కార్పొరేషన్ ఎన్నికల కోసం పైపైన మాట్లాడకుండా చిత్తశుద్ధితో పోరాటం చేయాలి. 22 మంది ఎంపీలను పెట్టుకొని పార్లమెంటులో మాట్లాడకుండా రాష్ట్రంలో నిరసన ప్రదర్శనలు చేస్తుంటే ఏం ప్రయోజనం? వైకాపా ఎంపీలు, ముగ్గురు తెదేపా ఎంపీలు పార్లమెంటులో పోరాడితేనే ప్రజలు నమ్ముతారు. మాకు పార్లమెంటులో సభ్యులు లేరు కాబట్టే రాష్ట్రంలో నిరసన చెబుతున్నాం’’ అని పవన్‌కల్యాణ్ అభిప్రాయపడ్డారు.
ఆంధ్రుల ఆత్మగౌరవ అంశంగా చూడాలని విన్నవించా
‘‘దేశంలోని మిగతా పరిశ్రమల్లాగా విశాఖ ఉక్కును చూడొద్దని దిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో చెప్పాను. దీన్ని ఆంధ్రుల ఆత్మగౌరవ అంశంగా చూడాలని విన్నవించాను. కర్మాగారం భూములిచ్చిన రైతుల కుటుంబాలు ఇప్పటికీ పరిహారం కోసం పోరాటం చేయటం, దేవాలయాల్లో ప్రసాదాలు తింటూ పనులకు వెళ్లటం నా పోరాట యాత్ర సమయంలో చూశాను. ఆత్మబలిదానాలు, త్యాగాలతో ఏర్పాటైన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రత్యేక దృష్టితో చూడమని అమిత్‌షాకు ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొన్నా. భాజపాతో పొత్తు పెట్టుకున్న మేము కేంద్ర హోంమంత్రికి ఉక్కు కర్మాగారంపై బలంగా చెప్పగలిగాం. ప్రజలు కోరుకునే విధంగా జనసేన వారికి అండగా ఉంటుంది. ఇదే మా మాట. చివరి వరకూ ఇదే మాటపై ఉంటాం’’ అని పవన్‌కల్యాణ్ స్పష్టం చేశారు.