ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Visakha Airport: రద్దీగా మారుతున్న విశాఖ విమానాశ్రయం.. రోజుకు సగటున 5 వేల మంది ప్రయాణం! - international flight services at visakhapatnam

గత ఏడాది కొవిడ్‌తో ఒక్కసారిగా పడిపోయిన ప్రయాణికుల సంఖ్య, గత డిసెంబరుకు అత్యధిక సంఖ్యకు చేరుకుంది. ఈ ఏడాది కూడా రెండో విడత కొవిడ్‌ ధాటికి బాగా తగ్గిన ప్రయాణాలు.. ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాయి. దీంతో విశాఖ విమానాశ్రయంలో ప్రయాణికుల రద్దీ కనిపిస్తోంది. ప్రత్యేకించి ఆగస్టు మాసంలో రోజుకు సగటున 5 వేల మంది వరకూ ప్రయాణాలు సాగిస్తున్నారు.

visakhapatnam airport
visakhapatnam airport

By

Published : Aug 29, 2021, 5:24 PM IST

Updated : Aug 29, 2021, 7:17 PM IST

రద్దీగా మారుతున్న విశాఖ విమానాశ్రయం

విశాఖ విమానాశ్రయం నుంచి విమానాలు పెరుగుతున్న తీరుతో.. ప్రయాణికుల సంఖ్య సైతం అంతకంతకూ పెరుగుతోంది. వివిధ విమాన సంస్థలు కూడా ఇక్కడికి తమ సర్వీసుల్ని తెచ్చేందుకు ఆసక్తి చూపిస్తుండటం మంచి పరిణామంగా కనిపిస్తోంది. ప్రస్తుతం కేవలం దేశీయ విమాన సర్వీసులు మాత్రమే నడుస్తున్నాయి. అంతర్జాతీయ సర్వీసులకు ఇంకా అనుమతులు రాలేదు. ప్రయాణికుల రద్దీకి తగ్గట్లు విమానాశ్రయ అధికారులు సైతం ఏర్పాట్లు చేస్తున్నారు.

పెరిగిన బుకింగ్స్..

దేశంలోని కీలక నగరాలకు వెళ్లేందుకు, ఇతర ప్రాంతాలనుంచి వచ్చేందుకు ఇప్పుడు విశాఖ విమానాశ్రయం నిలయంగా మారింది. గత కొన్నిమాసాలతో పోల్చితే ప్రత్యేకించి ఆగస్టులో బుకింగ్‌లు బాగా పెరుగుతున్నాయి. కొవిడ్‌ నిబంధనలు సులభతరం అవడం, పర్యాటక ప్రాంతాలు తెరచుకోవడం కూడా ఇందుకు కారణంగా కనిపిస్తోంది. గత 27 రోజుల్లో విశాఖ నుంచి ఏకంగా 1.34 లక్షల మంది ప్రయాణాలు సాగించారు. ఇందులో 51శాతం మంది వివిధ ప్రాంతాలనుంచి విశాఖకు రాగా, మరో 49శాతంమంది విశాఖ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు ఉన్నారు. తాజా పరిస్థితుల్ని బట్టి రోజుకు సగటున సుమారు 5వేల మంది ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

గత ఏడాది ఆగస్టులో విశాఖ నుంచి సుమారు 61 వేల మంది మాత్రమే రాకపోకలు చేశారు. ఈసారి ఆగస్టులో రెట్టింపుకన్నా ఎక్కువగా ప్రయాణాలు పెరిగాయి. నెలలో లక్షన్నర ప్రయాణాలు దాటొచ్చని అధికారులు అంచనాలు వేస్తున్నారు. జులైలో రోజువారీ 30 నుంచి 36 విమానాలు రాకపోకలు చేస్తుండగా.. ఇప్పుడు వాటి సంఖ్య రోజుకు 46కు పెరిగింది. ఇది మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. విశాఖ నుంచి దిల్లీ, హైదరాబాద్, చెన్నై, ముంబయి, బెంగళూరు, కోల్‌కతా, విజయవాడ, కర్నూలు, రాయపూర్, పోర్టుబ్లెయర్‌ తదితర ప్రాంతాలకు విమానాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో విశాఖ విమానాశ్రయంలో ప్రయాణికుల క్యూలు పెరుగుతున్నాయి.

సర్వీసులు పెరిగే అవకాశం..

3వ విడత కొవిడ్‌ భయాలు ఉన్నప్పటికీ ఈసారి విమాన ప్రయాణాలపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విమానాశ్రయ, విమాన సంస్థల సిబ్బంది, అలాగే ప్రయాణికుల్లో సుమారు 90నుంచి 95శాతం మంది వ్యాక్సినేషన్‌ వేసుకున్నట్లు నిర్ధరణకు వచ్చారు. దీంతో రానున్న ప్రభావాల్ని తట్టుకుని విమాన రంగం ముందుకెళ్లే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు.

ప్రస్తుతం విశాఖ విమానాశ్రయ కేంద్రంగా 46 దాకా విమానాలు రాకపోకలు చేస్తున్నాయి. పరిస్థితులన్నీ అనుకూలిస్తే వీటి సంఖ్య ఈ ఏడాది చివరికి 70 దాటొచ్చని అంచనాలు వేస్తున్నారు. అలాగే ప్రయాణికుల సంఖ్య నెలకు 2లక్షలు దాటొచ్చని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో పలు విమాన సంస్థలు ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకు ప్రతిపాదనలు పెట్టుకుంటున్నాయి. డిమాండ్‌ ఉన్న రూట్లలో సర్వీసుల్ని పెంచేందుకు కూడా చర్చలు నడుస్తున్నాయి.

ఇదీ చదవండి:

Flight Ban India: అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగింపు

Last Updated : Aug 29, 2021, 7:17 PM IST

ABOUT THE AUTHOR

...view details