విశాఖ నగరవ్యాప్తంగా 1032 ఖాళీ స్థలాలున్నట్లు జీవీఎంసీ గుర్తించింది. ఇందులో గ్రీన్‌స్పేస్ పార్కులు ఏర్పాటు చేయడానికి 506 ఖాళీ స్థలాలు అనువుగా ఉన్నట్లు తేల్చారు. విడతల వారీగా మొక్కలు నాటడం, పార్కుగా మార్చడం చేయనున్నారు. తొలి విడతగా జోన్-1, 5, 6లో పనులు మొదలుపెట్టడానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే 10 ప్రాంతాల్లో పార్కుల నిర్మాణానికి పనుల్ని అప్పగించినట్లు జీవీఎంసీ ఇంజినీర్లు చెబుతున్నారు. తాజాగా పెదగంట్యాడలో 3 పార్కులతో పాటు వడ్లపూడి దగ్గరున్న తిరుమలనగర్, చినముషిడివాడ దగ్గర్లోని శ్రమశక్తినగర్, దిబ్బపాలెం సమీపంలోని శ్రీనగర్, దేశపాత్రునిపాలెం ప్రాంతాల్లో సుమారు రూ.26లక్షలతో పార్కుల్ని ఏర్పాటు చేసేందుకు టెండర్లు పిలిచారు.
రూ.60 కోట్లు ఎలా..?
ప్రతిపాదిస్తున్న పార్కులు పూర్తిచేయడానికి సుమారు రూ.60కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనాలు వేస్తున్నారు. ఇంత డబ్బు జీవీఎంసీ కేటాయించగలదా అనేది ఇప్పుడు సందేహంగా ఉంది.
కాలుష్య నియంత్రణ మండలితో పాటు పరిశ్రమలు, స్వచ్ఛంద సంస్థలు, ఇతర సంస్థలు, వీఎంఆర్‌డీఏ, అటవీశాఖ.. ఇలా ఇతరత్రా విభాగాలు ప్రతిపాదిత స్థలాల్ని దత్తత తీసుకుంటే లక్ష్యాన్ని త్వరగా అధిగమించొచ్చని జీవీఎంసీ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం కమిషనర్ జి.సృజన స్థాయిలో ఇతర విభాగాలతో సంప్రదింపులు నడుస్తున్నాయి.