విశాఖ జిల్లా పరవాడలో దాదాపు రెండున్నర వేల ఎకరాలలో ఫార్మాసిటీ విస్తరించి ఉంది. ఈ ఫార్మాసిటీలో 103 పరిశ్రమలకు అనుమతి ఉంది. ఇందులో 85 పరిశ్రమలు ఉత్పత్తి, నిర్వహణ కార్యకలాపాలను చేస్తున్నాయి. కొవిడ్ సమయంలో ఫార్మా రంగం నిరంతరాయంగా పని చేయడం, కావాల్సిన ఉత్పత్తులు వివిధ ఔషధాలను ఇక్కడే సిద్ధం చేసి విదేశాలకు ఎగుమతి చేశారు. 32 వేల మందికి పైగా ఈ పరిశ్రమల్లో ఉపాధి పొందుతున్నారు. రూ.25 వేల కోట్ల పెట్టుబడులు ఫార్మాసిటీలో ఉన్నాయి. ఇందులో రూ.20 వేల కోట్ల ఉత్పత్తులు జరుగుతున్నాయి.
ఫార్మా పరిశ్రమ అంటేనే కాలుష్యం గరిష్టంగా ఉండే రెడ్ జోన్ పరిశ్రమలు ఎక్కువగా ఉంటాయని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాలు స్పష్టం చేస్తున్నాయి. ఫార్మా పరిశ్రమలు ఒకే చోట ఉండడం వల్ల వాటి ఘన, ద్రవ వ్యర్థాలన్నింటిని శుద్ధి చేశాకే బయటకు వదలాలన్న నిబంధన తప్పని సరిగా పాటించి తీరాలి. రాంకీ ఫార్మాసిటీలో ఘన వ్యర్ధాలతో పాటు అటు వ్యర్ధజలాలను శుద్ధి చేసి సముద్రంలోకి వదిలేందుకు అనుమతి ఉంది. ఈ వ్యర్థ జలాలు నేరుగా సముద్రంలోకి వెళ్తాయి. నిర్దేశిత మొత్తంలో మాత్రమే కాలుష్యాలు అందులో ఉండేట్టుగా జలచరాలకు ఎటువంటి హాని చేయని విధంగా వ్యర్థజలాలను శుద్ధి చేసిన తర్వాతనే కాలుష్య నియంత్రణ మండలి నిరంతర పర్యవేక్షణలో విడిచిపెట్టాలన్నది నిబంధన. ఈ నిబంధనను తాము పాటిస్తున్నామని రాంకీ వర్గాలు వివరిస్తున్నాయి.
వర్షాల సమయంలో ఫార్మా వ్యర్థ జలాలు గడ్డలు, కాలువల ద్వారా వచ్చి చెరువుల్లో చేరుతున్నాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. పరవాడ పెద్ద చెరువులో కాలుష్యం వల్ల చేపలు పెద్ద ఎత్తున మృత్యువాత పడ్డాయి. వ్యవసాయ భూములు, భూగర్భజలాలు కలుషితమైపోతున్నాయన్నది గ్రామస్థుల ఆవేదన.
పరవాడ ఫార్మాసిటీని అనుకుని ఉన్న 35 ఎకరాల విస్తీర్ణంలో ఊర చెరువు ఉంది. ఇది నిండిన తర్వాత 40 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పెద్ద చెరువులోకి నీరు చేరుతుంది. ఇటీవల వర్షాలకు ఈ రెండు చెరువులు పూర్తి స్థాయిలో నీరు చేరడం వల్ల చేపలు వేశారు. అవి పెరుగుతున్న సమయంలో కాలుష్య కారకాలు ఈ చెరువులో చేరడం వల్ల పెద్ద సంఖ్యలో జలచరాలు చనిపోయాయి. ఫార్మాసిటీలో ఉన్న సంస్థలు వ్యర్థజలాలను రాంకీ ట్రీట్మెంట్ ప్లాంట్‌కి పంపాలంటే వారికి ఫీజులు చెల్లించాల్సి ఉన్నందున ప్లాంట్‌కి విడిచిపెట్టకుండా నేరుగా వదిలేస్తున్నారన్నది రైతుల ఆరోపణ.