Old Age Pensioner Suicide Attempt: విశాఖ జిల్లా అనకాపల్లి గాంధీనగరానికి చెందిన శిరసాల లక్ష్మీ(70)కి గత 5 నెలలుగా పింఛన్ అందటం లేదు. వేలిముద్రలు, ఐరిష్ పని చేయటం లేదని వృద్ధురాలి పింఛన్‌ను అధికారులు నిలిపేశారు. నా అనే వారు లేక ఒంటరిగా జీవితం గడుపుతోన్న లక్ష్మీ.. పింఛన్ కోసం సచివాలయం చుట్టూ రోజు కాళ్లరిగేలా తిరిగింది. అధికారులు మాత్రం సాంకేతిక కారణాలు సాకుగా చూపుతూ.. ఫించన్‌ను ఇవ్వటం లేదు.
దీంతో తీవ్ర మనోవేదనకు గురైన వృద్ధురాలు.. ఇక జీవించి లాభం లేదని లక్ష్మీదేవిపేట సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద బలవన్మరణానికి యత్నించింది. గమనించిన స్థానికులు వృద్ధురాలికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
"ఐదు నెలలుగా పింఛను రావటం లేదు. నేను బతకలేను. నాకు పిల్లలు లేరు. ఇళ్లు కూడా లేదు. సచివాలయానికి వెళ్తే అధికారులు పట్టించుకోవటం లేదు. నన్ను చూసే వాళ్లెవరూ లేరు. ఈ వయసులో నేను బ్రతకటం వృథా. కళ్లు మూసుకొని రైల్వే ట్రాక్‌పై పడుకుంటా" అంటూ వృద్ధురాలు దీనంగా వాపోవటం పలువురిని కంటతడి పెట్టించింది.