భారతదేశంలోని నదులతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణ, గోదావరి, తుంగభద్ర నదులన్నీ పూర్తిగా కలుషితమయ్యాని పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. హరిద్వార్‌లోని మాత్రి ఆశ్రమంలో గంగా కాలుష్యంపై జరిగిన మేధావులు, విద్యావేత్తలు, ఉద్యమకారుల సమావేశంలో ప్రసంగించిన జనసేనాని... పరిశ్రమలు, గృహాల నుంచి వచ్చే వ్యర్థాలను నేరుగా నదుల్లో కలిపేస్తున్నారని, తద్వారా పర్యావరణ సమతుల్యతను నాశనం చేస్తున్నారన్నారు. భారతదేశం సాంస్కృతిక వారసత్వంతో ముడిపడి ఉందని, ఇక్కడి ప్రజలు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారన్నారు. ఏ అభివృద్ధైనా...పర్యావరణ సమతుల్యతపై ఆధారపడి జరగాలని ఆకాంక్షించారు. పర్యావరణ సమతుల్యత కోసం కట్టుబడి ఉండాలని ప్రాథమిక దశలోనే తమ పార్టీ నిర్ణయం తీసుకుందన్నారు. దేశంలో సహజ వనరులు కలుషితమై క్షీణించి పోతున్నాయని... ఫలితంగా ప్రధాన నగరాల్లో నీటి ఎద్దడి తీవ్రరూపం దాలుస్తోందని పవన్ ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖ నగరానికి వచ్చే పదేళ్లలో తాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చబోతోందని.. అక్కడ నీటిబొట్టు లభ్యమయ్యే పరిస్థితి గణనీయంగా పడిపోతోందని వాపోయారు.
నదుల ప్రక్షాళన గంగానదితో మొదలుపెట్టి.. దేశంలోని ప్రతి నదికీ..వాటి ఉపనదులకూ విస్తరించాలని సూచించారు. సహజ వనరులను ధ్వంసం చేస్తే.. ఉత్తరాఖండ్, నాగాలాండ్‌లలో జరిగిన ప్రకృతి వైపరీత్యమే... మిగిలిన భారతావనిలోనూ జరుగుతుందని అభిప్రాయపడ్డారు. నదుల ప్రక్షాళన కోసం.. ముఖ్యంగా గంగానది ప్రక్షాళన కోసం.. తనకు ఏ బాధ్యత అప్పగించినా స్థిరచిత్తంతో పూర్తిచేస్తానని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.