విశాఖలో(visakha)ని కొండలపై జనావాసాలు ఏర్పరుచుకుని దశాబ్దాలుగా ప్రజలు నివసిస్తున్నారు. కూలీనాలీ చేసుకుంటూ జీవనం గడుపుతున్న ఇక్కడి జనం పన్నులు, విద్యుత్ ఛార్జీలు వంటివి కడుతూనే ఉన్నారు. కొన్నేళ్లుగా ఈ కొండల్లో ఆక్రమణలు, క్వారీ తవ్వకాలు.. అక్కడి ప్రజలకు శాపంగా మారాయి. తవ్వకాల ప్రభావంతో కొండ వాలు గోడ కూలింది. ఈ ఘటన జరిగి 12 ఏళ్లయినా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదని స్థానికులు వాపోతున్నారు. ఉన్న ఒక్క బాటపైనే బిక్కుబిక్కుమంటూ రాకపోకలు(no roads to hills areas సాగిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు కొండచరియలు విరిగి బాటపై పడటంతో అది కాస్తా మూసుకుపోయినట్లైంది. తవ్వకాల వల్ల తమ ఇళ్లు కూడా కూలిపోయే ప్రమాదం ఏర్పడిందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.
విశాఖలోని హన్మంతువాక, చినగదిలి ప్రాంతాల్లో కొండలన్నీ జనావాసాలతో దర్శనమిస్తున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే చాలు... నివాసాలపై ఎప్పుడు కొండచరియలు విరిగిపడతాయోననే భయం వారిని వెంటాడుతూనే ఉంటుంది. తాజాగా కురిసిన భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడటంతో కాలిబాట కూడా కరువైంది. కొన్నిచోట్ల పైకి వెళ్లే దారి పూర్తిగా మూసుకుపోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమణలతో పాటు వర్షాల వల్ల బాటను ఆనుకుని ఉన్న వినాయకుడి ఆలయం కూడా కనుమరుగైందని చెబుతున్నారు. రోడ్డు నిర్మిస్తామని చెప్పి రెండేళ్లుగా తవ్వకాలు జరుపుతున్నారు తప్పా.. పనులు మాత్రం పూర్తికావడం లేదని ఆవేదన చెందుతున్నారు. జీవీఎంసీ(GVMC) అధికారులు చేపడుతున్న చర్యలు తమ సమస్యలకు పరిష్కారం చూపలేకపోతున్నాయని స్థానికులు వాపోతున్నారు.