No Permission to Cruise Ship: ఈనెల 8న విశాఖ నుంచి బయల్దేరిన క్రూయిజ్ షిప్‌కు ఆదిలోనే ఆటంకాలు ఎదురయ్యాయి. పర్యాటక శాఖ మంత్రి రోజా ప్రారంభించిన క్రూయిజ్ షిప్ ఈరోజు ఉదయం పుదుచ్చేరి చేరుకోవాలి. అయితే క్యాసినో, గ్యాంబ్లింగ్ ఆడే క్రూయిజ్‌కు అనుమతిచ్చేది లేదంటూ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై బ్రేక్ వేశారు. దీంతో శుక్రవారం ఉదయం 4 గంటల నుంచి షిప్ నడి సముద్రంలోనే ఆగిపోయింది. క్యాసినో, గ్యాంబ్లింగ్ ఉండే క్రూయిజ్‌ను పుదుచ్చేరిలోకి అనుమతించొద్దంటూ అక్కడి రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై స్పందించిన గవర్నర్ క్రూయిజ్‌ను అనుమతించాలంటే అందులో క్యాసినో, గ్యాంబ్లింగ్ లేదని నిర్ధారణ చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. పుదుచ్చేరి సమీపంలో లగ్జరీ క్రూయిజ్ షిప్‌కు లంగరు వేసేందుకు ప్రభుత్వం ఎలాంటి అనుమతి ఇవ్వలేదని తెలిపారు. టూరిజంను డెవలప్ చేయాలనే ఆసక్తి ఉన్నా.. భారతీయ సంస్కృతికి విరుద్ధంగా ఎలాంటి చర్యలు తీసుకోబోమన్నారు.
కేవలం ఆదాయం కోసం యువత జీవితాలను పాడు చేయమని లెఫ్టినెంట్ గవర్నర్ స్పష్టం చేశారు. ప్రజలకు లగ్జరీ క్రూయిజ్‌లో కొత్త సముద్ర ప్రయాణ అనుభూతిని అందించాలని తమిళనాడు ప్రభుత్వం కోర్డెలియా క్రూయిజ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. తమిళనాడు ప్రభుత్వం ప్రారంభించిన ఈ క్రూయిజ్‌కు పుదుచ్చేరి ప్రభుత్వం అనుమతించడం లేదు. దీంతో భారీ క్రూయిజ్ సముద్రం మధ్యలో నిలిచిపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.
సాగరంలో ఓ స్టార్‌హోటల్! :మన భారత సముద్రజలాల్లో తిరుగుతున్న అతిపెద్ద ప్రయాణికుల నౌకల్లో ఈ ‘కార్డేలియా క్రూయిజ్-ఎమ్వీ ఎంప్రెస్’ నౌక ఒకటి. ఇందులో ఒక్కసారే పదిహేను వందల మంది దాకా ప్రయాణించవచ్చు. ఓడలో మొత్తం 11 అంతస్తులుంటాయి. ఇంజిన్‌కీ, సరకులకీ కిందున్న రెండు అంతస్తులు పోగా... మూడో అంతస్తు నుంచి ప్రయాణికులు బసచేసే గదులు మొదలవుతాయి. అక్కడి నుంచి పదో అంతస్తుదాకా లిఫ్ట్‌లో వెళ్ళొచ్చు.