నౌకాదళంలో గూఢచర్యం కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ కీలకమైన వ్యక్తిని అరెస్టు చేసింది. ముంబైలోని మహ్మద్ హరూన్ హాజీ అబ్దుల్ రెహ్మాన్ లక్కడ్ వాలా అనే వ్యక్తిని ఈ కేసులో అరెస్టు చేసినట్టు ఎన్ఐఏ వెల్లడించింది. హరూన్ హాజీ విశాఖ నౌకాదళ కమాండ్ కేంద్రంగా కొందరు సిబ్బందికి డబ్బు ఆశ చూపి యుద్ధనౌకలు, జలాంతార్గాముల రాకపోకల సమాచారాన్ని పాకిస్తాన్ కు చేరవేసినట్టు ఎన్ఐఏ తెలిపింది.
పాకిస్తాన్కు కీలక సమాచారం
విశాఖలోని తూర్పు నౌకాదళ కమాండ్ లో నౌకాదళ రహస్యాలను గూఢచర్యం చేస్తున్న కేసులో ముంబై కి చెందిన మహ్మద్ హరూన్ హాజీ అబ్దుల్ రెహ్మాన్ లక్కడ్ వాలా అనే వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఎ అరెస్టు చేసింది. నౌకాదళ రహస్యాలను పాకిస్తాన్ కు చేరవేస్తున్న కేసులో ప్రధాన కుట్రదారుగా మహ్మద్ హరూన్ హాజీని ఎన్ ఐఏ పేర్కొంది. నౌకాదళానికి చెందిన యుద్ధనౌకలు, జలాంతర్గాములకు సంబంధించిన రాకపోకలు, ఇతర కీలకమైన సమాచారాన్ని ఇతను పాకిస్తాన్ కు చేరవేస్తున్నట్టుగా ఎన్ఐఏ గుర్తించింది.
ఎన్ఐఏ అదుపులో 11 మంది
ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే నౌకాదళ సిబ్బంది సహా 11 మందిని ఎన్ఐఏ అరెస్టు చేసింది. ఇందులో పాకిస్తాన్ లో జన్మించిన ఓ భారత జాతీయుడైన షాయిస్తా ఖైజర్ కూడా ఉన్నట్టు ఎన్ఐఏ వెల్లడించింది. వీరందరిపైనా విజయవాడలోని కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసు స్టేషన్ లో దేశద్రోహం, దేశరహస్యాల గూఢచర్యం, కుట్ర తదితర అభియోగాలపై కేసులు నమోదు చేశారు. మహ్మద్ హరూన్ హాజీ ఇంటి నుంచి కొన్ని కీలకమైన పత్రాలతో పాటు గూఢచర్యానికి సంబంధించిన డిజిటల్ పరికరాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టు ఎన్ఐఏ తెలిపింది.