దేశ రహస్యాలను దాయాది దేశానికి చేరవేస్తూ అన్నదమ్ములు సాగించిన చీకటి వ్యవహారాలు కలకలం రేపుతున్నాయి. గుజరాత్‌లోని పంచమహల్ జిల్లా గోద్రా ప్రాంతానికి చెందిన గిటెలీ సోదరులు... పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐకి ఏజెంట్లుగా పనిచేస్తూ, భారత్‌లో ఉగ్ర కార్యకలాపాలు సాగించారని ఎన్ఐఏ గుర్తించింది. వస్త్ర వ్యాపారం ముసుగులో తరచూ పాకిస్థాన్‌కు వెళ్లి... ఐఎస్ఐ చెప్పినట్లు చేసేవారని దర్యాప్తులో తేలింది. వీరిని నడిపించింది ఎవరు, ఈ రెండు కేసుల వెనుక ఉన్న సూత్రధారి ఒకరేనా, ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణాల్లో ఎన్ఐఏ దర్యాప్తు సాగిస్తోంది.
విశాఖపట్నం గూఢచర్యం కేసులో నిందితుడైన ఇమ్రాన్ గిటెలీ... తొలుత లేడీస్‌టైలర్‌గా, ఆ తర్వాత ఆటోడ్రైవర్‌గానూ పని చేశాడు. భారత్‌లో దుస్తులు విక్రయించే ముసుగులో ఐఎస్ఐ ఏజెంటుగా మారాడు. అసఫ్ అనే వ్యక్తి నుంచి వచ్చే ఆదేశాలు పాటిస్తూ... విశాఖ, ముంబయి నౌకాదళ కేంద్రాల్లో పనిచేసే ఉద్యోగుల్ని ప్రలోభాలకు గురిచేసేవాడు. దేశంలోని కీలక సంస్థలు, రక్షణ స్థావరాలు, అంతరిక్ష పరిశోధన కేంద్రాలు, వ్యూహాత్మక ప్రదేశాలు లాంటి రక్షణ సమాచారం, చిత్రాలు, వీడియోలు సేకరించి... పాకిస్థాన్ నిఘా విభాగానికి చేరవేసేవాడు. సమాచారం ఇచ్చిన నేవీ ఉద్యోగుల ఖాతాల్లో పెద్దమొత్తంలో డబ్బులు జమ చేసేవాడు. ఇలా ఏడాది వ్యవధిలోనే 65 లక్షల వరకూ జమ చేసినట్లు ఎన్ఐఏ గుర్తించింది. గతేడాది సెప్టెంబరులో ఇమ్రాన్ గిటెలీని అరెస్టు చేసిన అధికారులు... మార్చిలో అభియోగపత్రం దాఖలు చేశారు.