ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వలపు ఉచ్చు.. సిబ్బంది వేతన ఖాతాల్లోకే ‘పాక్‌’ సొమ్ము - nia investigation about navy officers news

పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ ప్రతినిధుల వలపు ఉచ్చులో చిక్కుకుని దేశ భద్రత రహస్యాలను వారికి చేరవేసిన భారత నౌకాదళ ఉద్యోగుల వేతన ఖాతాలు, వారి బంధువులు, సన్నిహితుల బ్యాంకు ఖాతాల్లో ఎప్పటికప్పుడు పెద్ద ఎత్తున నిధులు జమయ్యేవని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) తేల్చింది. ముంబయికి చెందిన హవాలా ఆపరేటర్లు ఇంతియాజ్‌ సయ్యద్‌, షేక్‌ సహిస్థాలు (మహిళ) పాకిస్థాన్‌ హ్యాండ్లర్ల నుంచి వచ్చే ఆదేశాల మేరకు సంబంధిత నౌకాదళ ఉద్యోగుల ఖాతాల్లో ఈ సొమ్ములు వేసేవారని గుర్తించింది.

nia about navy officers contacts with pak
nia about navy officers contacts with pak

By

Published : Jan 30, 2020, 7:35 AM IST

Updated : Jan 30, 2020, 7:57 AM IST

ఉగ్రదాడుల సన్నాహక కార్యక్రమాల్లో భాగస్వాములమవుతున్నామని నిందితులందరికీ తెలుసని ఎన్​ఐఏ నిగ్గు తేల్చింది. ఈ నెల 18, 22 మధ్య ఎన్‌ఐఏ కస్టడీకి తీసుకుని విచారణ నిర్వహించిన సందర్భంలో ఈ కేసులో వారి ప్రమేయాన్ని, నేరపూరిత చర్యలను నిందితులే అంగీకరించినట్లు సమాచారం. నిందితులు ఫేస్‌బుక్‌, ఈ-మెయిల్‌ ఖాతాల ద్వారా పాక్‌కు చెందిన ఐఎస్‌ఐ ప్రతినిధులతో సంభాషణలు జరిపినట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. సాంకేతిక నిపుణుల సాయంతో వారి ఖాతాల్లోకి లాగిన్‌ అయ్యి అందులోని సమాచారాన్ని విశ్లేషించింది. వాటిలో ఎక్కువ భాగం నేరపూరిత అంశాలే ఉన్నట్లు తేల్చింది. కొన్ని కీలక డాక్యుమెంట్లనూ డౌన్‌లోడ్‌ చేయించి స్వాధీనం చేసుకుంది. సంభాషణల సారాంశమేంటి? ఎప్పుడెప్పుడు ఎలాంటి సమాచారం పాక్‌కు చేరింది? అనే అంశాలపై మరింత లోతుగా దృష్టి సారించింది.

అంతా పాతికేళ్లలోపు వారే

ఈ కేసులో ఇప్పటివరకూ 13 మంది నిందితులను ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. వీరిలో ఇద్దరు హవాలా ఆపరేటర్లు, 11 మంది నౌకాదళ ఉద్యోగులున్నారు. వీరంతా పాతికేళ్లలోపు యువకులే. ప్రధానంగా సున్నీకుమార్‌ అలియాస్‌ సున్నీ సింగ్‌, అశోక్‌కుమార్‌ డెగ్‌, సంజయ్‌కుమార్‌దాస్‌, అశోక్‌కుమార్‌, సోమ్‌నాథ్‌ సంజయ్‌ ఇకడే, సంజయ్‌కుమార్‌, వికాస్‌కుమార్‌, సోనుకుమార్‌, కలవలపల్లి కొండబాబు, అవినాష్‌ సోమల్‌లు వాట్సాప్‌ ద్వారా యుద్ధనౌకలు, సబ్‌మెరైన్ల కదలికల సమాచారాన్ని, నౌకాదళ కార్యకలాపాల వివరాలను ఎప్పటికప్పుడు పాక్‌ నిఘా విభాగం అధికారులకు పంపించేవారని దర్యాప్తులో తేలింది. కీలక స్థావరాలకు సంబంధించిన చిత్రాలు, వీడియోలను పంపించినట్లు ఎన్‌ఐఏ గుర్తించింది.

ఫోరెన్సిక్‌ ప్రయోగశాలలకు చేతిరాత

నిందితుల మెయిళ్లలో చేతిరాతతో కూడిన కొన్ని కీలక డాక్యుమెంట్లు ఎన్‌ఐఏకు లభించాయి. వారిని అరెస్టు చేసినప్పుడూ కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. ఈ చేతిరాత ఎవరిదో విశ్లేషించేందుకు డాక్యుమెంట్లను ఫోరెన్సిక్‌ ప్రయోగశాలకు ఎన్‌ఐఏ పంపించింది. చేతిరాతను సరిపోల్చేందుకు నిందితుల సంతకాలనూ సేకరించింది.

ఇదీ చదవండి: కరెంట్ ఉంటేనే ప్రాణం నిలిచేది.. ఆదుకుంటేనే కష్టం తీరేది!

Last Updated : Jan 30, 2020, 7:57 AM IST

ABOUT THE AUTHOR

...view details