ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'అపారమైన శక్తి... అనంత విశ్వాసం: విజయ సాధనకు మార్గాలు' - vivekananda golden words

జనవరి 12... 1863. భరతమాత మరిచిపోలేని రోజు అది. ఆ రోజు... దేశం గర్వపడేలా ఏదో చెప్పాలని తహతహలాడింది. యావత్తు దేశం తలెత్తుకునేలా చేసే ఓ మహనీయుడికి జన్మనిచ్చింది. నిలువెత్తు స్పూర్తి ప్రదాతను దేశానికి పరిచయం చేసింది. ఆయనే... స్వామి వివేకానంద. మనదేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన స్వామి వివేకానంద జన్మించిన జనవరి 12న భారతీయులు ఏటా జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటారు.

national youth day
స్వామి వివేకానంద

By

Published : Jan 12, 2020, 12:00 AM IST

యువత శక్తి అంతులేనిది. అపారమైనది. దేశ ఉన్నతికి, ఔన్నత్యానికి ఈ శక్తిని జోడిస్తే... తిరుగులేని విజయాలు సొంతమవుతాయి. యువత సాధించే విజయాలు వ్యక్తిగతం కాదు. సామాజికమైనవి. కొన్ని సందర్భాల్లో జాతీయ, అంతర్జాతీయమవుతాయి. అయితే... ఈ యువశక్తి ఎప్పుడూ సానుకూల దృక్పథంలో సాగాలి. లేకపోతే... దేశానికి ఎంత మేలు చేస్తుందో... గతితప్పితే అంతకు రెట్టింపు కీడుచేస్తుంది.

హృదయానికి, మెదడుకు సంఘర్షణ తలెత్తితే... హృదయం మాట వినండి.

స్వామి వివేకానంద దేశ భవిష్యత్తు గురించి ఎన్నో కలలుగన్నారు. జాతిని జాగృతం చేయడానికి లెక్కలేనన్ని మంచి మాటలు చెప్పారు. ఒక్కొక్క మాట గుండెలకు సూటిగా తగులుతుంది. మెదడుకు పదును పెడుతుంది. దేశాభివృద్ధిలో మన పాత్రను గుర్తుచేస్తుంది. ఏడాదిలో ఒక్క రోజు మాత్రమే ఆయనను స్మరించుకోవడం దేశానికే చిన్నతనం అవుతుంది. అంత మహనీయుడు ఆయన. ఆయన చూపిన బాట మహాద్భుతం. ఆ బాటే ఇప్పుడు దేశాన్ని చెప్పుకోదగ్గ స్థాయిలో నిలబెట్టేలా చేస్తోంది.

రోజుకు ఒకసారైనా మీతో మీరు మాట్లాడుకొండి. లేకపోతే ఓ అద్భుత వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు.

పాశ్చాత్య దేశాల్లోకి అడుగుపెట్టిన మొదటి హిందూ ప్రముఖుడు ఈయనే. స్వామి వివేకానంద భారతదేశానికీ, హిందూ మతానికి ప్రాతినిధ్యం వహిస్తూ... 1893 సెప్టెంబరు 11న చికాగోలో మొదటి ప్రపంచ మత సమ్మేళనంలో చేసిన ప్రసంగం సువర్ణాక్షరాలతో లిఖించదగినది. ప్రపంచవ్యాప్తంగా పలు మతాల ప్రతినిధులు ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు. వివేకానంద చేసిన ఈ చరిత్రాత్మక ప్రసంగంలో... ప్రియమైన అమెరికా సోదర సోదరీమణులారా (మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా) అని సంబోధిస్తూ ప్రారంభించారు. ఈ పిలుపులోని ఆత్మీయత యావత్తు ప్రపంచాన్ని అమితంగా ఆకర్షించింది.

ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉన్న యువత ఈ దేశానికి అవసరం.

లేవండి... మేల్కొనండి... గమ్యం చేరేదాక ఆగవద్దు.. అని స్వామి వివేకానందుడు చెప్పిన మాటలు అందరికీ స్ఫూర్తి. ఆ స్ఫూర్తితోనే దేశాభివృద్ధిలో భాగస్వాములు అవుదాం. శక్తివంతమైన ఆలోచనలతో దేశాన్ని మరింత తిరుగులేని శక్తిగా అవతరింపజేద్దాం. ఆధ్యాత్మికతను, సోదరభావాన్ని, నైతిక విలువలను పాటిస్తూ... వివేకానందుడు చూపిన మార్గంలో పయనిద్దాం. భారతావని ప్రపంచానికి దిక్సూచి అయ్యేలా చేద్దాం. దానికి మనం చేయాల్సింది ఒక్కటే. అదే... మన పని మనం పూర్తి నిబద్ధతతో, శ్రద్ధగా, నిజాయతీగా చేయడం..!

కెరటం నాకు ఆదర్శం. ఎగసి పడుతున్నందుకు కాదు. పడినా లేస్తున్నందుకు.

ABOUT THE AUTHOR

...view details