ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖ రుషికొండ తవ్వకాలపై జాతీయ హరిత ట్రైబ్యునల్ స్టే - విశాఖ రుషికొండ తవ్వకాలపై ఎన్డీటీ ఆదేశాలు

NGT stay on Rushikonda excavations
విశాఖ రుషికొండ తవ్వకాలపై జాతీయ హరిత ట్రైబ్యునల్ స్టే

By

Published : May 11, 2022, 11:56 AM IST

Updated : May 12, 2022, 4:28 AM IST

11:54 May 11

ఎంపీ రఘురామ పిటిషన్‌పై ఈనెల 6న విచారణ జరిపిన ఎన్జీటీ బెంచ్

NGT on Rishikonda: తాము తదుపరి విచారణ చేపట్టే వరకూ రుషికొండపై పర్యాటకాభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టవద్దని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్మాణాలకు సంబంధించి కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ, రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థలకు (ఏపీటీడీసీ) నోటీసులు జారీ చేసింది. పర్యావరణపరంగా సున్నిత ప్రాంతమైన రుషికొండపై నిబంధనలను ఉల్లంఘిస్తూ నిర్మాణాలు చేపడుతున్నారంటూ వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఎన్జీటీ ప్రధాన ధర్మాసనంలో (దిల్లీ) పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం ఈ అంశంపై విచారణకు సంయుక్త నిపుణుల కమిటీని నియమించింది. ఆ కమిటీ మార్చి 29న నివేదిక అందజేసింది. దానిపై ఎన్జీటీ ఛైర్మన్‌ జస్టిస్‌ ఆదర్శ్‌ కుమార్‌ గోయల్‌, జస్టిస్‌ సుధీర్‌ అగర్వాల్‌, విషయ నిపుణుడు ప్రొఫెసర్‌ ఎ.సెంథిల్‌వేల్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపి తాజాగా ఉత్తర్వులను వెలువరించింది. ‘సంయుక్త నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా అన్నా యూనివర్సిటీ చేసిన మ్యాపింగ్‌ ప్రకారం రుషికొండ తీరప్రాంత క్రమబద్ధీకరణ జోన్‌ పరిధిలోకి వస్తుంది. అయినప్పటికీ ఈ విషయాన్ని తీర ప్రాంత యాజమాన్య మండలి (సీజడ్‌ఎంపీ) నుంచి నిర్ధారించుకోవాల్సి ఉంది. పర్యావరణపరంగా సున్నిత ప్రాంతమైన కొండపై ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపకుండా ప్రస్తుత ప్రాజెక్టు ఆచరణ సాధ్యమేనా అని తెలుసుకునేందుకు స్వతంత్ర కమిటీతో నిర్ధారించుకోవాలని భావిస్తున్నాం. ఇందుకోసం జాతీయ తీర ప్రాంత యాజమాన్య మండలి (ఎన్‌సీజడ్‌ఎంఏ), ఆంధ్రప్రదేశ్‌ తీర ప్రాంత యాజమాన్య మండలి (ఏపీసీజడ్‌ఎంఏ), జాతీయ సుస్థిర తీరప్రాంత యాజమాన్య మండలి (ఎన్‌సీఎసీఎం) సభ్యులుగా కమిటీని నియమిస్తున్నాం. ఈ కమిటీ ప్రస్తుత ప్రాజెక్టు పర్యావరణపరంగా ఆచరణ సాధ్యమేనా? సీఆర్‌జడ్‌ ఇచ్చిన అనుమతులను పునఃపరిశీలించాలా అనే విషయాన్ని పరిశీలించి నెలలోపు నివేదిక సమర్పించాలి’ అని ఉత్తర్వుల్లో పేర్కొంది. కేసు తదుపరి విచారణను ధర్మాసనం జులై 11వ తేదీకి వాయిదా వేసింది.

ఇవీ చదవండి:

Last Updated : May 12, 2022, 4:28 AM IST

ABOUT THE AUTHOR

...view details