నర్సీపట్నం ప్రభుత్వాస్పత్రిలో పని చేసే మత్తు వైద్యుడు సుధాకర్ రావు... ఆస్పత్రిలోని పరిస్థితులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పేరుకే 150 పడకల ఆస్పత్రి ఉందని.. కనీస సౌకర్యాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్లకు ఒక్క మాస్క్ ఇచ్చి 15 రోజుల వాడమంటున్నారని ఆరోపించారు. పరిస్థితులు ఇలాగే ఉంటే నర్సీపట్నం మొత్తం పాజిటివ్ కేసులు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఆస్పత్రి పరిస్థితులపై జిల్లా కో ఆర్డినేటర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదన్నారు. అనుభవం లేని జూనియర్ వైద్యురాలితో శస్త్ర చికిత్సలు చేయిస్తున్నారని.. ప్రసూతి నిపుణురాలిని ఇంతవరకు నియమించలేదని అన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు ఆస్పత్రిని కనీసం పట్టించుకునే స్థితిలో లేరని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలపై దృష్టి సారించాలని కోరారు.
ఆరోపణల్లో వాస్తవం లేదు: ఆస్పత్రి సూపరింటెండెంట్
ఈ వ్యాఖ్యలపై ఆస్పత్రి సూపరింటెండెంట్ నీలవేణి స్పందించారు. వైద్యుడు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు. తమ వద్ద అవసరమైన అన్ని రకాల సామగ్రి అందుబాటులో ఉందని స్పష్టం చేశారు.