రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో వైకాపా మెజార్టీ స్థానాల్ని గెలుచుకుంది. ప్రధాన ప్రతిపక్షం తెదేపా చాలాచోట్ల గట్టి పోటీనిచ్చింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోని మూడు స్థానాల్ని గెలుచుకుంది. మొత్తం 11 జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ జరగ్గా.. వైకాపా 8, తెదేపా 3 చోట్ల గెలిచాయి. 129 ఎంపీటీసీ స్థానాల్లో వైకాపా 85, తెదేపా 33 చొప్పున గెలుపొందాయి. జనసేన ఐదు, సీపీఎం రెండు, సీపీఐ, భాజపా ఒక్కో స్థానంలో విజయం సాధించాయి. ఇద్దరు స్వతంత్రులు గెలిచారు.
ఎమ్మెల్యేలకు చుక్కెదురు
- వైకాపా ఎమ్మెల్యే రెడ్డిశాంతి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలోని హిరమండలం జడ్పీటీసీ స్థానంలో ఆమె కుమారుడు శ్రవణ్.. తెదేపా అభ్యర్థి పొగిరి బుచ్చిబాబు చేతిలో 59 ఓట్ల తేడాతో ఓడిపోయారు. చెల్లని ఓట్లుగా పక్కనపెట్టిన 332 బ్యాలెట్ పత్రాల్ని మళ్లీ పరిశీలించి, లెక్కించాలని వైకాపా పట్టుబట్టింది. అయినా ఫలితం మారలేదు. బుచ్చిబాబు వంశధార ప్రాజెక్టు నిర్వాసితుడు.
- కృష్ణా జిల్లా పెడనలో వైకాపా ఎమ్మెల్యే జోగి రమేశ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. పెడన జడ్పీటీసీ స్థానంలో 658 ఓట్ల ఆధిక్యంతో తెదేపా అభ్యర్థి అర్జా వెంకటనగేశ్ గెలుపొందారు. నగేశ్ విజయ డెయిరీలో డైరెక్టర్‌గా ఉన్నారు.
- గుంటూరు జిల్లాలో వైకాపా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న వినుకొండ నియోజకవర్గంలోని శావల్యాపురం జడ్పీటీసీ స్థానాన్ని తెదేపా గెలుచుకుంది. అక్కడ తెదేపా అభ్యర్థి పారా హైమావతి 1,046 ఓట్ల ఆధిక్యం సాధించారు. బ్రహ్మనాయుడు, హైమావతి ఇద్దరూ వేల్పూరు గ్రామస్థులే. వైకాపా నాయకులు శావల్యాపురం ఎంపీపీ, కారుమంచి పీఏసీఎస్ అధ్యక్షుడిదీ అదే గ్రామం. తెదేపా అభ్యర్థిగా అప్పట్లో హైమావతి భర్త హైమారావు నామినేషన్ వేశారు. ఉపసంహరణకు ముందే ఆయన చనిపోవడంతో ఎన్నిక రద్దైంది. ఇప్పుడు హైమావతి పోటీచేసి ఘనవిజయం సాధించారు.
- రాష్ట్రంలో అత్యధికంగా కృష్ణా జిల్లాలో మూడు జడ్పీటీసీలకు ఎన్నికలు జరగ్గా.. రెండుచోట్ల వైకాపా, ఒకచోట తెదేపా గెలిచాయి.
ఎంపీటీసీ ఎన్నికల్లోనూ గట్టిపోటీ
- ఎంపీటీసీ ఎన్నికల్లోనూ పలు స్థానాల్లో వైకాపా, తెదేపా అభ్యర్థుల మధ్య పోరు హోరాహోరీగా సాగింది. శ్రీకాకుళం, తూర్పుగోదావరి, అనంతపురం జిల్లాల్లో ప్రతిపక్షం గట్టి పోటీనిచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో 15 ఎంపీటీసీ స్థానాలకు ఐదు, తూర్పుగోదావరి జిల్లాలో 21కి 6, అనంతపురం జిల్లాలో 16కు 6చోట్ల తెదేపా అభ్యర్థులు గెలిచారు.
- తూర్పుగోదావరి జిల్లాలో సీపీఎం రెండు, సీపీఐ ఒక ఎంపీటీసీ స్థానాల్ని గెలుచుకున్నాయి. ఒకప్పుడు ఖమ్మం జిల్లాలో భాగంగా ఉండి, ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో కలసిన ఎటపాక మండలంలోని విస్సుపురంలో సీపీఎం, కృష్ణవరంలో సీపీఐ గెలుపొందాయి. వి.ఆర్.పురం మండలంలోని చిన్నమట్టపల్లెలో సీపీఎం గెలిచింది.
- విజయనగరం జిల్లా మక్కువ మండలంలోని ఎ.వెంకంపేటలో భాజపా విజయం సాధించింది.
- గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో ఉన్న ఫిరంగిపురం మండలంలోని గుండాలపాడు, వేమవరం ఎంపీటీసీలను తెదేపా కైవసం చేసుకుంది. రాజధాని అమరావతి పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతం నుంచి వైకాపా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
తగ్గిన ఓట్లు.. ఏమైనట్లు?
అనంతపురం జిల్లా పెనుకొండ మండలం రాంపురం ఎంపీటీసీ స్థానానికి పోలైన ఓట్ల కంటే.. బ్యాలెట్ పెట్టెల్లో తక్కువ ఓట్లు ఉన్నాయి. పోలింగ్ నాడు 2,251 ఓట్లు నమోదుకాగా, లెక్కింపులో ఆరు ఓట్లు తక్కువగా వచ్చాయి. ఓటర్లు బ్యాలెట్ పేపర్‌ను బాక్సులో వేయకుండా వెళ్లిపోవడం వల్లే తేడా వచ్చిందని ఎంపీడీవో శివశంకరప్ప తెలిపారు. అక్కడ తెదేపా అభ్యర్థి కె.పద్మావతి 55 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
లెక్కింపులో వివాదాలు
- నెల్లూరు జిల్లా కోట మండలం కోట-2 ఎంపీటీసీ స్థానంలో తెదేపా, వైకాపా అభ్యర్థులకు సమానంగా ఓట్లు వచ్చాయి. అధికారులు మరోసారి లెక్కించి, వైకాపాకు మూడు ఓట్ల ఆధిక్యం వచ్చినట్టు ప్రకటించారు.
- విశాఖ జిల్లా కె.కోటపాడు మండలంలోని దాలివలస ఎంపీటీసీగా వైకాపా అభ్యర్థి కొట్నాన అశోక్ 26 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందినట్టు అధికారులు ప్రకటించారు. లెక్కింపులో తేడా జరిగిందంటూ తెదేపా నేతలు రీకౌంటింగ్ కోరారు. ఆర్వో తిరస్కరించడంతో.. గంటపాటు రాస్తారోకో చేశారు.
- చిత్తూరు జిల్లా గుడిపాల మండలం వసంతాపురం ఎంపీటీసీ స్థానంలో తెదేపా అభ్యర్థి విజయలక్ష్మి 16 ఓట్ల ఆధిక్యం సాధించారు. వైకాపా నాయకులు రీకౌంటింగ్‌కు పట్టుబట్టగా.. ఆర్వో అంగీకరించలేదు. జడ్పీ సీఈవోకు ఫిర్యాదు చేయగా.. ఆయన ఆదేశాలతో మళ్లీ ఓట్లు లెక్కించారు. తెదేపా అభ్యర్థి 15 ఓట్ల మెజార్టీ తేలింది.
- ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చదలవాడ ఎంపీటీసీ స్థానంలో జనసేన అభ్యర్థి పమిడిముక్కల శివకృష్ణకు 126 ఓట్ల మెజార్టీ వచ్చింది. వైకాపా అభ్యర్థి డిమాండ్ మేరకు రెండోసారి లెక్కించినా.. అదే ఫలితం వచ్చింది.
- పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం సత్యవోలు ఎంపీటీసీగా తెదేపా నుంచి నాగరాజు 26 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. వైకాపా నాయకుల డిమాండ్‌తో రీకౌంటింగ్ చేయగా.. నాగరాజు మెజార్టీ 27కు పెరిగింది.
ఎన్నికల కోడ్ ఎత్తివేత