ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఎం ఆదేశాలు పాటించండి... నేతలకు విజయసాయి సూచన

విశాఖ వైకాపా పంచాయితీ సీఎం చెంతకు చేరిన వేళ.. పార్టీ జిల్లా ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో ఎంపీ విజయసాయిరెడ్డి సమావేశం నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవలి జిల్లా సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యేల వ్యాఖ్యలు దుమారం రేపిన నేపథ్యంలో.. సంస్థాగత అంశాలను బహిరంగ వేదికలపై మాట్లాడొద్దనే నియమావళిని... ఉల్లంఘించవద్దని నేతలకు విజయసాయిరెడ్డి గట్టిగానే చెప్పినట్టు తెలిసింది. జిల్లాల పునర్వ్యస్దీకరణ నేపథ్యంలో.... పార్టీ కమిటీల ఏర్పాటు, ప్రభుత్వ పథకాల అమలులో లోటుపాట్లు సరిదిద్దడంపై చర్చించామని.. నాయకుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఎమ్మెల్యేలు తెలిపారు.

mp vijayasai reddy
ఎంపీ విజయసాయిరెడ్డి

By

Published : Nov 13, 2020, 5:24 PM IST


విశాఖలో ఈ వారంలో జరిగిన జిల్లా అభివృద్ది మండలి సమీక్షా సమావేశంలో జరిగిన చర్చలు పార్టీలో తీవ్ర దుమారం రేపాయి. వీటిని ముఖ్యమంత్రి జగన్ తీవ్రంగా పరిగణించారన్నది కూడా పార్టీలో చర్చకు తావిచ్చింది. ఈ తరుణంలో విశాఖలోని ప్రభుత్వ అతిథిగృహంలో వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి ఎమ్మెల్యేలు, నియోజకవర్గ బాధ్యులు, సీనియర్ నేతలతో సమావేశం నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధానంగా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఈ సమావేశానికి హాజరు కావడంతో రాజకీయంగా ఏ రకమైన పరిణామాలు ఉంటాయన్నది అసక్తికరంగా మారింది.

ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు క్షేత్ర స్దాయిలో ఏరకంగా ఉన్నాయన్న అంశాలను సమీక్షించడమే కాకుండా లోటు పాట్లు ఉంటే వాటిని ఏరకంగా దిద్దుబాటు చేయాలన్నది చర్చించామని ఎమ్మెల్యేలు వివరించారు. తమలో ఎటువంటి బేధాలు లేవని తమకు ప్రతిపక్షమైనా, అధికారపక్షమైనా తామే కాబట్టి ప్రభుత్వ పథకాల అమల్లో లోపాలు తలెత్తితే వాటిని చర్చించాల్సిన బాధ్యత కూడా తమపైనే ఉందని వారు తెలిపారు.

ఈ సమావేశం సుదీర్ఘంగానే సాగింది. జిల్లాల పునర్వ్యస్ధీకరణ జరుగుతున్న దృష్ట్యా రానున్న రోజుల్లో ఈ కమిటీలను ఏరకంగా ఏర్పాటు చేసుకోవాలి, ఉన్న కమిటీల పునర్విభజన వంటి అంశాలు చర్చించినట్టు విజయసాయిరెడ్డి వెల్లడించారు. సమావేశం తర్వాత మీడియా మైకుల ముందు మాట్లాడకుండా చర్చించిన అంశాన్నిక్లుప్తంగా చెప్పి వెళ్లిపోయారు. సంస్దాగతంగా ఉన్న అంశాలను బహిరంగ వేదికలపై ఎక్కడా మాట్లాడకుండా సంయమనం పాటించాలన్న పార్టీ నియమావళిని ఉల్లంఘించవద్దని నేతలకు గట్టిగానే చెప్పినట్టు సమాచారం.

ABOUT THE AUTHOR

...view details