ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'సృష్టి' కేసు.. బిడ్డ చనిపోయిందని నమ్మించి అమ్మేశారు: సీపీ ఆర్కే మీనా - Visakha CP RK Meena comments on srusti case

పసిగుడ్డుకు జన్మనిచ్చిన తల్లికి ఆ బిడ్డ పురిట్లోనే చనిపోయినట్లు కట్టుకథ అల్లుతారు. ఆ బిడ్డను వేరే వారికి అమ్మేస్తారు. సరోగసీ ద్వారా శిశువుని ఇస్తామని లక్షలు గుంజుతారు. పేదలకు ఉచిత ప్రసవం... అనే వారి వలకు చిక్కిన వారికి.. పుట్టిన బిడ్డను ఓసారి చూసుకునే అవకాశం కూడా ఇవ్వరు అక్కడి కసాయి వైద్యులు. విశాఖ సృష్టి ఆస్పత్రి వ్యవహారంలో విస్తుపోయే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి.

More facts are known in the case of srusti: CP
సీపీ ఆర్.కె.మీనా

By

Published : Aug 6, 2020, 6:10 PM IST

Updated : Aug 7, 2020, 2:51 AM IST

సీపీ ఆర్.కె.మీనా

విశాఖలో పసిపిల్లల అక్రమరవాణా కేసులో మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. మరికొన్ని శిశువిక్రయాలపైనా కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తల్లికి బిడ్డ చనిపోయిందని చెప్పి.. ఆ బిడ్డను ఇంకో జంటకు భారీ మొత్తానికి అమ్మేసిన వ్యవహారం తాజాగా బయటపడింది. ఇందులో మరో వైద్యురాలికి సంబంధం ఉండడంతో పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ సీపీ ఆర్కే మీనా, డీసీపీ-1 ఐశ్వర్య రస్తోగి, డీసీపీ-2 సురేష్​బాబులు వెల్లడించిన వివరాల ప్రకారం.. విశాఖ జిల్లా చోడవరం మండలానికి చెందిన గర్భిణి వెంకటలక్ష్మి గతేడాది చోడవరం లోని స్థానిక ఆస్పత్రికి వైద్యం కోసం వెళ్లింది. అక్కడున్న నూకరత్నం అనే మహిళ ఆమెను పరిచయం చేసుకొని విశాఖ సృష్టి ఆస్పత్రిలో ఉచితంగా ప్రసవం చేయిస్తానని నమ్మించింది. ఆశా వర్కర్​ కె.వెంకటలక్ష్మి, ఆమె బంధువైన రామకృష్ణ(సృష్టి ఆస్పత్రి ఏజెంట్​) భాగస్వాములై సృష్టి ఆస్పత్రికి పరీక్షల నిమిత్తం వెంకటలక్ష్మిని నవంబరులో తీసుకువచ్చారు.

జనవరి నెలాఖరులో ప్రసవం అవుతుందని వైద్యురాలు డాక్టర్​ తిరుమల చెప్పడంతో జనవరి 29న 'సృష్టి' ఆస్పత్రిలో వెంకటలక్ష్మిని ప్రసవం నిమిత్తం చేర్చారు. రక్త పరీక్షలు చేసి ఆ నివేదికను సీతమ్మధారలోని పద్మజ ఆస్పత్రికి చెందిన డాక్టర్​ పద్మజకు చూపించారు. పరిశీలించిన పద్మజ.. సజేరియన్​ చేయాలని చెప్పటంతో వెంకటలక్ష్మిని సృష్టి ఆస్పత్రి నుంచి డాక్టర్​ తిరుమల, డాక్టర్​ సరోజినిల సహకారంతో పద్మజ ఆస్పత్రిలో జనవరి 30న చేర్పించారు. తరువాత రోజు ఆమెకు సిజేరియన్​ చేయగా.. ఆమె ఆడపిల్లకు జన్మనిచ్చింది. అయితే పుట్టిన బిడ్డ చనిపోయిందని వైద్యులు, ఆశా వర్కర్​, ఏజెంట్​ రామకృష్ణలు వెంకటలక్ష్మిని నమ్మించారు. బిడ్డను ఒక తెల్లని వస్త్రంలో ఉంచి చనిపోయినట్లు చూపించి తీసుకువెళ్లిపోయారు. వెంకటలక్ష్మిని ఫిబ్రవరి 3న డిశ్చార్జి చేశారు. బిడ్డను రహస్యంగా మరో ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం అందించారు.

రూ.13 లక్షలకు శిశువు విక్రయం

ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం విజయనగరానికి చెందిన దంపతులకు రూ.13 లక్షలకు బిడ్డను విక్రయించారు. ప్రసవం సమయానికి పద్మజ ఆస్పత్రిలో చేరినప్పుడు బిడ్డ తల్లిదండ్రుల పేర్లను వెంకటలక్ష్మి, సన్యాసిరావుగా రాసిన డాక్టర్​ పద్మజ.. తర్వాత బిడ్డను మరో ఆస్పత్రికి పంపించినప్పుడు తల్లిదండ్రుల పేర్లను మార్చి రాశారు. ఈ కేసు విషయమై తాజాగా పద్మజ, నూకరత్నంలను పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన వారు ఇప్పటికే జైలులో ఉన్నారు.

ఫిర్యాదుతో వెలుగులోకి

సృష్టి ఆస్పత్రి ద్వారా పిల్లల అమ్మకాలు జరిగినట్లు వెలుగులోకి రావటంతో తన బిడ్డను కూడా ఇలాగే అమ్మేసుంటారనే అనుమానంతో వెంకటలక్ష్మి జులై 30న ఎంవీపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో విచారించిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి.

సరోగసీ పేరు చెప్పి బిడ్డలను మాయం చేయడంలో సృష్టి వ్యవహారంలో మరిన్ని వాస్తవాలు బయటకు విచ్చే అవకాశాలున్నాయి. 2017 నుంచి సృష్టి ఆస్పత్రిలో 63 అద్దెగర్భాల ప్రసవాలు జరిగాయన్న సీపీ... సరోగసి శిశువుల్లో 4 అక్రమ విక్రయాలు గుర్తించినట్టు వివరించారు. కేసు ప్రాధాన్యత దృష్ట్యా అన్ని పోలీస్‌ స్టేషన్లను అప్రమత్తం చేశామని సీపీ ఆర్​.కె. మీనా వివరించారు.

ఇదీ చూడండి..

కారు డోర్ లాక్.. ఊపిరాడక ముగ్గురు చిన్నారులు మృతి

Last Updated : Aug 7, 2020, 2:51 AM IST

ABOUT THE AUTHOR

...view details