విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజాప్రతినిధులు రాజీనామా చేస్తే ఉపయోగం ఏమిటని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. రాజీనామా చేస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందా అని ప్రశ్నించారు. ఈ విషయంలో కేంద్రంపై అంతా కలిసి పోరాడి సాధించాలని పిలుపునిచ్చారు. రాజీనామా చేయాలని తెదేపా చేస్తున్న వ్యాఖలు అర్ధరహితమని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై సీఎం జగన్ ఇప్పటికే స్పష్టత ఇచ్చారని..తెదేపా సహా అన్ని రాజకీయ పార్టీలు, ట్రేడ్ యూనియన్లను దిల్లీకి తీసుకెళ్తామని చెప్పారని వెల్లడించారు. చంద్రబాబు హయాంలో ఏ సమస్యపైన అయినా ఒక్కసారైనా అఖిలపక్షం పెట్టారా అని నిలదీశారు.
పంచాయతీ ఎన్నికల్లో ఓడిన చంద్రబాబు ఉక్రోషంతో మాట్లాడుతున్నారని పెద్దిరెడ్డి విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ 90శాతం విజయం వైకాపాదేనని స్పష్టం చేశారు. మళ్లీ ఎన్నికలు వస్తే వైకాపాకు 170 స్థానాలను కైవసం చేసుకుంటుందనే విషయాన్ని తెదేపా నేతలు గుర్తించాలన్నారు.