విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు డీపీఆర్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. మెట్రో రైల్ ప్రాజెక్టుపై విజయవాడలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. పురపాలకశాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ప్రత్యేక కార్యదర్శి రామ మనోహర్‌రావు, మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
కొవిడ్ కారణంగా డీపీఆర్ రూపకల్పనలో ఆలస్యం జరిగిందని అధికారులు మంత్రికి తెలిపారు. త్వరలోనే తుదిరూపు ఇస్తామని వివరించారు. విశాఖ మెట్రో మార్గం మొత్తం ఎత్తు ప్రదేశంలోనే ఉంటుందని తెలిపారు. విశాఖ నగరం నుంచి భోగాపురం ఎయిర్ పోర్టు వరకు ఏయే మార్గాల్లో మెట్రో రైల్ ఏర్పాటుకు అవకాశాలున్నాయో మంత్రి చర్చించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ గేట్ నుంచి కొమ్మాది జంక్షన్ వరకు, గురుద్వారా నుంచి పాత పోస్ట్ ఆఫీసు వరకు, తాటిచెట్లపాలెం-చినవాల్తేరు, కొమ్మాది జంక్షన్-భోగాపురం.. నాలుగు కారిడార్లలో మెట్రో మార్గం ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు.
విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుపై మంత్రి బొత్స సమీక్ష ఈ కారిడార్లన్నీ కలిపి సుమారు 75 కిలోమీటర్ల మేర మెట్రో కనెక్టివిటీ వస్తుందని అధికారులు తెలిపారు. నిర్దేశించిన కారిడార్లలో ఎక్కడెక్కడ స్టేషన్లు ఏర్పాటు చేస్తే, ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది, నిర్వహణ సౌలభ్యం తదితర విషయాల్లో తుది అంచనాలకు వచ్చే ముందు అవసరమనుకుంటే మరోసారి క్షేత్రస్థాయిలో స్వయంగా పర్యటించి అధ్యయనం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. అంతేకాకుండా ఎక్కడెక్కడ పార్కింగ్ స్థలాలు అవసరం, పచ్చదనం తదితర అంశాలపై చర్చించారు. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం మెట్రో పూర్తి అయితే, 2025 నాటికి మెట్రో రైల్లో సగటున రోజుకు 6 లక్షల మంది ప్రయాణించే అవకాశముందని అధికారులు వివరించారు.
మెట్రో రైల్ స్టేషన్లు, రైల్వే లైన్ల ఏర్పాటుకు వీలైనంత వరకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలనే వినియోగించుకునేలా డిజైన్ చేస్తున్నామని అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ప్రైవేటు భూముల సేకరణ తప్పనిసరి అయ్యే అవకాశం ఉందని... ఇందుకు సంబంధించిన వివరాలను కూడా డీపీఆర్‌లో పొందుపరుస్తామని పేర్కొన్నారు. ప్రాజెక్టు చేపట్టడానికి అవసరమైన నిధులు, వాటి సమీకరణ మార్గాలను కూడా డీపీఆర్‌లో పొందుపర్చాలని మంత్రి అధికారులకు సూచించారు. అన్ని అంశాలను సమగ్రంగా అధ్యయనం చేసి అత్యుత్తమ ప్రమాణాలతో విశాఖ మెట్రో రైల్ ఉండేలా ప్రణాళికను రూపొందించాలని మంత్రి బొత్స ఆదేశించారు.
ఇదీ చదవండి :వైకాపా.. ఒక్క ఛాన్స్‌ను ఆఖరి ఛాన్స్ చేసుకుంది: చంద్రబాబు