విశాఖ జిల్లా పద్మనాభంలో అనంతపద్మనాభస్వామి కొండమెట్ల దీపోత్సవాన్ని పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు, సింహాచలం దేవస్థానం ఆలయ ధర్మకర్త సంచయిత గజపతిరాజుతో కలిసి ప్రారంభించారు. తొలి పావంచావద్ద మొదటి దీపాన్ని వెలిగించి దీపోత్సవాన్ని ప్రారంభించారు. 1300 మంది ప్రత్యేక సేవకులతో దీపోత్సవం నిరాడంబరంగా నిర్వహించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఆలయ ఈవో లక్ష్మీనారాయణ శాస్త్రి ఆధ్వర్యంలో దీపోత్సవాన్ని నిర్వహించారు. కరోనా కారణంగా పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులకు అనుమతి ఇచ్చారు.
ఆలయ సంప్రదాయం ప్రకారం కొండమెట్ల మొదటి పావంచా వద్ద నుంచి దీపాలు వెలిగించారు. కొండ దిగువన ఉన్న కుంతీమాధవస్వామి ఆలయంలోనూ కొండ పైనున్న శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలోనూ పురోహితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భూదేవి శ్రీదేవి సమేతంగా అనంత పద్మనాభ స్వామిని గరుడ వాహనంపై ప్రతిష్టించి కుంతీమాధవ స్వామి ఆలయానికి తూర్పు దిశగా ఊరేగించారు. దేవతామూర్తుల విగ్రహాలను మొదటి మెట్టు వద్ద ఆచమనం చేసి ఆలయ సంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజాలు నిర్వహించారు.