‘పిచ్చివేషాలు వేయకుండా ఇంటికి రా.. నా మాట విను.. అన్ని రకాలుగా బాగుంటుంది.. అరగంటలో పంపించేస్తాను.. చెప్పిన మాట విను. నా కోసం అరగంట సమయం కూడా కేటాయించలేవా? ఏం చేస్తున్నావ్? రాకపోతే నీ ఇష్టం.. వస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది’ అంటూ ఓ మహిళతో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సంభాషిస్తున్నట్లుగా ఉన్న ‘ఆడియో’ గురువారం సామాజిక మాధ్యమాల్లో తీవ్ర కలకలం సృష్టించింది. రాజకీయవర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. విషయం తెలిసిన మంత్రి ముత్తంశెట్టి గురువారం రాత్రి పది గంటల సమయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు.
నా రాజకీయ ఎదుగుదల చూసి ఓర్వలేకే
తన రాజకీయ ఎదుగుదల చూసి ఓర్వలేకే కొందరు నకిలీ ఆడియో సృష్టించి సామాజిక మాధ్యమాల్లో తన వ్యక్తిత్వ హననానికి పూనుకున్నారని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, ప్రస్తుతం జిల్లా నుంచి ఏకైక మంత్రిగా పని చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు తనపై ఎలాంటి ఆరోపణలు లేవన్నారు. వైకాపాకు మహిళల్లో ఆదరణ విపరీతంగా పెరుగుతోందన్న ఉద్దేశంతోనే తనపై ఈ తరహాలో బురద జల్లడానికి ప్రయత్నించారని తెలిపారు. ఎవరెవరో ఫోన్లు చేసి అడుగుతుంటే బాధనిపించిందన్నారు. తాను దేవుణ్ని నమ్మే వ్యక్తినని, తనను ఇబ్బందిపెట్టినవారు ఇబ్బంది పడక తప్పదని పేర్కొన్నారు. విషయం తెలిసిన వెంటనే తాను నగర పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశానన్నారు. సైబర్ క్రైం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారని, నిందితులెవరో పోలీసులే తేలుస్తారని మంత్రి చెప్పారు.