ప్రభుత్వ అతిథి గృహం నిర్మించే స్థలానికి, తొట్లకొండకు సంబంధం లేదని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. తొట్లకొండకు, బావికొండకు... ఇప్పుడు ప్రభుత్వం నిర్మిద్దామనుకుంటున్న స్థలానికి కిలోమీటరు దూరం ఉందని ఆయన తెలిపారు. దీనిపై రాజకీయ నేతలు వివాదాలు చేయవద్దని చెప్పారు. తొట్లకొండలో బౌద్ధక్షేత్రం, ఇతర బౌద్ధ స్తూపాల పరిధి గల 120 ఎకరాల చుట్టూ రక్షణ కంచె ఉందని మంత్రి తెలియజేశారు. కచ్చితంగా తొట్లకొండను ప్రపంచ బౌద్ధ పవిత్ర పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని మంత్రి అవంతి తెలిపారు.
ప్రభుత్వ అతిథి గృహం నిర్మాణం అనేది ప్రభుత్వ కార్యక్రమమని... దానికి రహస్య శంకుస్థాపనలు వర్తించవని చెప్పారు. ప్రభుత్వ అతిథి గృహం నిర్మాణాలకు జిల్లా కలెక్టర్ చైర్మన్గా వ్యవహరిస్తుంటారని... విశాఖ, విజయవాడ, కాకినాడ, కర్నూల్లో అతిథి గృహాల నిర్మాణం జరుగుతుందని మంత్రి చెప్పుకొచ్చారు.