ప్రసాదం పథకంపై కేంద్ర పర్యాటక కమిటీ సభ్యులు విశాఖలోని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఇంట్లో సమావేశమయ్యారు. కేంద్ర పర్యాటక శాఖ సహాయ కార్యదర్శి ఎస్.ఎస్. వర్మ నేతృత్వంలో బృందం ప్రసాదం పథకంపై చర్చలు జరుపుతోంది. ఈ సందర్భంగా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ..సింహాచలం మెట్ల మార్గం పనులు మధ్యలో ఆగిపోయాయని వెల్లడించారు. మాధవధార వైపు ఉన్న మెట్ల మార్గం వినియోగించుకోవాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు.
ఆలయంలో యజ్ఞశాల నిర్మాణం తలపెట్టినట్లు మంత్రి పేర్కొన్నారు. భక్తుల కోసం వెయిటింగ్ హాల్ నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్న మంత్రి.. గిరి ప్రదక్షిణ కోసం ట్రాక్ ఏర్పాటునకు ఆలోచిస్తున్నట్లు స్పష్టం చేశారు. కేంద్ర బృందాన్ని పంపిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి...ముత్తంశెట్టి శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో అన్నవరం, విజయవాడ, చిన్నతిరుపతి దేవాలయాలకు ఈ పథకం వర్తించేలా కమిటీని కోరినట్లు ఆయన చెప్పారు.