మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తిపై పరిస్థితికి అనుగుణంగా చర్యలు చేపట్టామని విశాఖ స్టీల్ ప్లాంట్ ట్వీటర్ వేదికగా వెల్లడించింది. గత వారం 400 టన్నుల మెడికల్ ఆక్సిజన్ సరఫరా చేసినట్లు తెలిపింది. కొవిడ్ చికిత్స అవసరాల కోసం కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా ఆక్సిజన్ సరఫరా చేస్తామని వివరించింది.
విశాఖ ఉక్కు కర్మాగారంలో మొత్తం ఐదు ఆక్సిజన్ యూనిట్లు 7.3 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి కోసం పని చేస్తున్నాయి. ఇందులో మూడు యూనిట్లు ఒక్కోక్కటి రోజుకు 550 టన్నుల సామర్థ్యం కలిగినవి కాగా.. రెండు యూనిట్లు రోజుకు 600 టన్నుల సామర్థ్యం కలవి ఉన్నాయి. ప్రతి రోజూ దాదాపు 2,600 టన్నుల ఆక్సిజన్‌ను వాయు రూపంలో, వంద టన్నులను ద్రవ రూపంలో ఉత్పత్తి చేస్తున్నారు. ద్రవ రూప ఆక్సిజన్ పూర్తిగా వైద్య అవసరాల కోసం వినియోగిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో విశాఖ ఉక్కు మెడికల్ ఆక్సిజన్ సరఫరా కోసం చర్యలు ముమ్మరం చేసింది. ఇప్పటికే 400 టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ను కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏపీతో పాటు మరికొన్ని రాష్ట్రాలకు సరఫరా చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో విశాఖ ఉక్కు కర్మాగారం 8,842 టన్నుల మెడికల్ ఆక్సిజన్‌ను సరఫరా చేసింది.