పరిపాలనా రాజధానిగా ప్రకటించిన విశాఖను...మరింత అభివృద్ధి పథంలో నిలిపేందుకు వైకాపా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. జీవీఎంసీ పరిధిలో గతంలో వివిధ పనులు చేసిన గుత్తేదారులకు రూ.350 కోట్ల బకాయిలను త్వరగా చెల్లించి ఇక్కడ మౌలిక వసతుల పనుల వేగం పెంచాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా ముఖ్య నేతలు విమానాశ్రయం నుంచి నగరంలోకి ప్రవేశించకుండా నగర శివారు ప్రాంతాలకు చేరుకునేందుకు వీలుగా ప్రత్యేక రహదారిని కేటాయించే ఆలోచనలో యంత్రాంగం ఉంది. విమానాశ్రయం నుంచి ఎన్‌ఏడీ, గోపాలపట్నం, సింహాచలం, హనుమంతవాక, మధురవాడ ప్రాంతాలను కలిపేలా 35 కి.మీ మార్గాన్ని ఇందుకు ఎంపిక చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇందులో భాగంగా ఈ మార్గంలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించి, ముస్తాబు చేయాలని ప్రణాళిక రూపొందిస్తున్నారు. భవిష్యత్తులో ముఖ్యమంత్రి వచ్చినా ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
2 కి.మీ మార్గం విస్తరిస్తేనే..
నగరంలో ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా ముఖ్యల రాకపోకలు ఉండాలని యోచిస్తున్నారు. ప్రతిపాదిత మార్గంలో ప్రస్తుతం ఎన్‌ఏడీ కూడలిలో రోటరీ పై వంతెన పూర్తయింది. ఎన్‌ఏడీ నుంచి హనుమంతవాక వరకు బస్సు శీఘ్ర రవాణా వ్యవస్థ (బీఆర్‌టీఎస్) ఉంది. ఇందులో భాగంగా సింహాచలం గోశాల కూడలి నుంచి అడవివరం కూడలి వరకు 2 కి.మీ రహదారి విస్తరణ విషయమై 2007 నుంచి వివాదం నడుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఇక్కడి బాధితులకు నష్టపరిహారం చెల్లించి రోడ్డును విస్తరించేలా ప్రయత్నాలు చేశారు. న్యాయపరమైన చిక్కులు ఉండటంతో ముందుకు సాగలేదు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ వివాదాన్ని పరిష్కరించాలని చర్చలు జరుపుతోంది. అక్కడి నిర్వాసితులతో మంత్రులు చర్చించి పరిష్కారం చూపించాలని భావిస్తున్నారు. బుధవారం దీనిపై చర్చించే అవకాశాలున్నాయి. అక్కడి గృహాలకు టీడీఆర్ ఇవ్వడమా, లేక భూములు ఇవ్వడమా అనే విషయమై చట్టపరంగా ఓ పరిష్కారానికి రావాలని చూస్తున్నారు. ఈ రోడ్డు వివాదం తొలగకున్నా.. రాకపోకలకు ఇబ్బంది ఉండకపోయినా ఇప్పుడున్న ట్రాఫిక్ సమస్యలు తొలగాలంటే వెంటనే పరిష్కరించాలని యంత్రాంగం భావిస్తోంది.
పలు ప్రతిపాదనలకు ఆలోచనలు