విశాఖపట్నం జిల్లా ఎస్పీ ఎదుట మావోయిస్టు పెదబయలు దళానికి చెందిన ఇద్దరు పార్టీ సభ్యులు తాంబేలు సీత అలియాస్ నిర్మల, పాంగి లచ్చి అలియాస్ శైలూలు లొంగిపోయారు. సీఆర్పీఎఫ్ కమాండెంట్ కవీంద్ర కుమార్ చంద్, కమాండెంట్ సంజీవ్ కుమార్ ద్వివేది, విశాఖ జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు ఎదుట వీరు లొంగిపోయారు.
తాంబేలు సీత తండ్రి చిన్నతనంలోనే చనిపోవడం, ఆర్ధిక పరిస్థితులు బాగోలేని కారణంగా కూలిపనులు చేస్తూ గ్రామంలోనే ఉండేది. తన కుటుంబ సభ్యుల నిరాదరణ, పేదరికం, ఇంకా పెళ్లి కాలేదని గ్రామస్థులు హేళనగా మాట్లాడడం వంటి కారణాల వలన దళంలోకి వెళ్లింది. తొలి ఆరు నెలలు మిలీషియాగా పనిచేసి తర్వాత పార్టీ సభ్యురాలిగా ప్రమోట్ అయి పెదబయలు దళంలో ఇప్పటివరకు పనిచేసింది. పెదబయలు దళంలో కీలక సభ్యురాలిగా ఉన్నఈమెకు స్థానిక కోందు తెగకు చెందిన వ్యక్తి కావడం వల్ల మారుమూల గ్రామాలపై మంచి పట్టు ఉంది. రెండు హత్యలతో సహా మందుపాతరలను పేల్చడం వంటి తొమ్మిది నేరాలతో ఈమెకు సంబంధం ఉంది.
అనారోగ్యం, భౌగోళికంగా క్లిష్టత వల్ల అటవీ ప్రాంతం కారణంగా పార్టీతో కలసి తిరగలేకపోవడం వంటి కారణాలతో పార్టీ నుంచి బయటకు వచ్చినట్టు సీత వివరించింది. పాంగి లచ్చి అలియాస్ శైలు సొంత గ్రామస్ధులైన కొందరు పార్టీ సభ్యుల ప్రభావంతో దళంలో చేరింది. ఈ యేడాది జూలైలో తీగలమెట్ట గ్రామాల అటవీ ప్రాంతంలో జరిగిన ఫైరింగులలో మావోయిస్టు పార్టీ సీనియర్ క్యాడర్ ను తప్పించడంలో కీలక పాత్ర పోషించింది. గతంలో పలువురిని హత్య చేసిన కేసులూ ఉన్నాయి.