ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మంచానికే పరిమితమైన విశాఖ ఎల్‌జీ పాలిమర్స్‌ బాధితుడు

విశాఖలో ఏడాది క్రితం జరిగిన ఎల్‌జీ పాలిమర్స్‌ దుర్ఘటన అనేక మంది జీవితాల్లో చీకటి నింపింది. లీకైన స్టైరీన్‌ గ్యాస్‌తో చాలామంది తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. కొందరైతే శరీరంలోని అవయవాలు చెడిపోయి మంచానికే పరిమితమయ్యారు. ఆ బాధితుల్లో ఒకరు వెంకటాద్రి గార్డెన్స్‌కు చెందిన బీవీ కమలాకర్‌ (33). ప్రమాద సమయంలో  స్టైరీన్‌ గ్యాస్‌ను అధికంగా పీల్చడంతో క్రమేణా అది శరీరంలోని వివిధ అవయవాలపై తీవ్ర ప్రభావం చూపినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వెన్నుపూస నుంచి కాళ్లకు వెళ్లే నరాల వ్యవస్థ దెబ్బతింది. ఎముకలకు పట్టి ఉండే కండ వదిలేసింది. శరీరంలో రసాయన చర్య కారణంగా ఇలా జరిగిందని వైద్యులు తెలిపారు.

visakha LG polymers tragedy
ఎల్‌జీ పాలిమర్స్‌ దుర్ఘటన

By

Published : Jun 20, 2021, 7:27 AM IST

విశాఖలో ఏడాది క్రితం జరిగిన ఎల్‌జీ పాలిమర్స్‌ దుర్ఘటనలో చాలా మంది ఆనారోగ్యానికి గురయ్యారు. ఆసమయంలో పాలిమర్స్​ నుంటి వెలువడిన స్టైరీన్‌ గ్యాస్‌తో కారణంగా చాలా మంది అవయవాలు దెబ్బతిన్నాయి. ఆ బాధితుల్లో ఒకరు వెంకటాద్రి గార్డెన్స్‌కు చెందిన బీవీ కమలాకర్‌ (33). కమలాకర్‌ ఏయూ నుంచి ఎమ్మెస్సీ (ఎనలిటికల్‌ కెమిస్ట్రీ) చేశారు. చెన్నై ఐఐటీ నుంచి పేటెంట్‌ లా చదివారు. ఓ ఫార్మా కంపెనీ పరిశోధనా విభాగంలో పేటెంట్‌ అనలిస్టుగా పని చేశారు. ఎల్‌జీ పాలిమర్స్‌కు దగ్గరే ఉంటున్నారు.

వీపుపై శస్త్ర చికిత్స చేయడంతో ఇలా..

‘ప్రమాదం జరిగినప్పుడు స్టైరీన్‌ వాయువు పీల్చి అమ్మతో సహా నేనూ ఇంట్లో స్పృహ కోల్పోయా. అధిక మొత్తంలో గ్యాస్‌ పీల్చేశా. ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా రెండు రోజులకు స్పృహ వచ్చింది. నల్లటి వాంతులవడంతో ఎక్స్‌రే తీయగా ఊపిరితిత్తులకు వాయువు పట్టినట్లు గుర్తించారు. ప్రాథమిక చికిత్స అందించి పంపించేశారు. నెలలుగా దగ్గు, ఆయాసం తగ్గకపోవడంతో గత ఏడాది నవంబరులో వైద్యుడ్ని కలిశా. ఎక్స్‌రే తీస్తే ఊపిరితిత్తుల్లో కుడివైపు రంధ్రం పడినట్లు గుర్తించారు. 2 నెలలకు వీపు వైపు నుంచి గడ్డలు ఏర్పడ్డాయి. మార్చి నుంచి నా కాళ్లు పని చేయట్లేదు. మంచానికే పరిమితమయ్యా. కిడ్నీలపై బొబ్బలు రావడం, ఊపిరితిత్తుల్లోని రంధ్రం పెద్దదవడంతో పాటు శరీరంలో కుడివైపు ఉన్న అవయవాలు, నడుం కింది భాగాలు పనిచేయడం లేదని తేల్చారు. అత్యవసర శస్త్రచికిత్స చేసి వెన్నెముక లోపలి నుంచి రంధ్రాలు చేసి ఊపిరితిత్తుల్లోని ముద్దలు బయటకు తీశారు. శరీరమంతా ఆ సమస్య వ్యాపించకుండా ఆగడంతో ప్రాణాలతో బయటపడ్డా. చచ్చుబడిన నరాలను ఉత్తేజం చేయడం కోసం రోజూ ఫిజియో థెరపీ చేయిస్తున్నారు. అమ్మ రమా సుందరి కంటికిరెప్పలా నన్ను కాపాడుతోంది’ అని కమలాకర్‌ కన్నీటిపర్యంతమయ్యారు.

సమయానికి చికిత్స అందక..

‘ప్రభుత్వం అప్పట్లో రూ.లక్ష పరిహారం అందజేసింది. ఆ తరువాత ఖర్చు అయిన రూ.3 లక్షలను మేమే భరించాం. కనీసం ఆరోగ్యశ్రీలోనైనా చికిత్స అందలేదు. ఆదాయం వచ్చే దారిలేక నానా పాట్లు పడుతున్నాం. సాయం అందించాలని కలెక్టరుకు విన్నవించాం. ముఖ్యమంత్రి కార్యాలయానికీ లేఖలు రాశాం’ అని కమలాకర్‌ తెలిపారు.

ఇదీ చదవండి:

హడలెత్తిస్తున్న బ్లాక్‌ఫంగస్‌ కేసులు, మరణాలు

ABOUT THE AUTHOR

...view details