Suicide: భూవివాదంలో పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజ్, వైకాపా నాయకుల ప్రోద్బలంతో పోలీసులు, రెవెన్యూ అధికారుల వేధింపులతోనే విశాఖ జిల్లా పెందుర్తి మండలం ముదపాక పంచాయతీ గోవిందపురం గ్రామానికి చెందిన సారిపల్లి సోమేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆరోపించారు. ఈ నెల 8న ఆత్మహత్యకు యత్నించిన సోమేశ్వరరావు కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందారు. మృతదేహానికి నివాళులర్పించడానికి మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, జీవీఎంసీ తెదేపా ఫ్లోర్‌లీడర్ పీలా శ్రీనివాసరావు, తెదేపా నాయకులు గోవిందపురం బయలుదేరారు. గ్రామంలో అప్పటికే పెద్దఎత్తున మోహరించిన పోలీసులు తెదేపా నేతలతోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలను మార్గమధ్యలోనే అడ్డుకున్నారు. వెనక్కి వెళ్లిపోవాలని, లేకుంటే అరెస్టు చేయాల్సి వస్తుందని ఏసీపీలు మోహన్‌రావు, శ్రీనివాసరావు హెచ్చరించారు. దీంతో బండారు, పీలా శ్రీనివాసరావు, గ్రామస్థులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. నాయకులు, స్థానిక మహిళలు, పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఎమ్మెల్యే, వైకాపా నాయకుల ప్రోద్బలంతో రెవెన్యూ అధికారులు వేధించడమే సోమేశ్వరరావు ఆత్మహత్యకు కారణమని పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని బండారు ఆరోపించారు. చర్యలు తీసుకోవాలని ఏసీపీ మోహన్‌రావుకు ఫిర్యాదు కాపీ అందజేశారు. అంత్యక్రియలకు సమయం మించిపోతున్న నేపథ్యంలో సహకరించాలని పోలీసులు కోరడంతో నిరసన విరమించారు. అనంతరం శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారనే కారణంతో తెదేపా నాయకులను అరెస్టు చేసేందుకు డీసీపీ సుమిత్ సునీల్ ప్రయత్నించడంతో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. నాయకులను వారి వాహనాల్లోనే సింహాచలం వరకు తీసుకెళ్లి విడిచిపెట్టారు.
Suicide: వైకాపా నేతల వేధింపులు తాళలేక వ్యక్తి ఆత్మహత్య... ఎక్కడంటే..? - ఏపీ తాజా వార్తలు
Suicide: విశాఖ జిల్లాలో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వైకాపా నేతల ప్రోద్బలంతో అధికారులు, పోలీసుల వేధింపులు తాళలేక బాధితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ ఆరోపించారు. అసలేం జరిగిందంటే..?
నిరసన