LG Polymers Victims Seminar: విశాఖ ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనకు రెండేళ్లు పూర్తయినా... ఇంకా ఆ పీడకల స్థానికులను వెంటాడుతూనే ఉంది. బాధితులకు మెరుగైన వైద్యం కోసం మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి కడతామన్న పాలకుల మాటలు కార్యరూపం దాల్చలేదు. రెండేళ్లయినా ఇంకా తమకు పరిహారం అందలేదని కొందరు మృతుల కుటుంబీకులు వాపోతున్నారు.
విశాఖ వెంకటాపురంలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు. 2020 మే 7న స్టైరిన్ గ్యాస్ లీకై 12 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఈ దుర్ఘటన ఆనవాళ్లు ఇప్పటికీ అక్కడి ప్రజలను కలచి వేస్తున్నాయి. స్టైరిన్ గ్యాస్ పీల్చిన స్థానికులు ఇంకా అనారోగ్య సమస్యలతో బాధపడుతూనే ఉన్నారు. వారికి మెరుగైన వైద్యం అందించేందుకు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం చేపడతామన్న ప్రభుత్వ పెద్దల మాటలు నీటి మూటలుగానే మిగిలాయని స్థానికులు మండిపడుతున్నారు.