పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువులు, మందుల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ విశాఖలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. భాజపా అధికారంలోకి వచ్చిన తరువాత పెట్రో ధరలు ఒక్క మే నెలలోనే 22 సార్లు పెంచారని.. పెట్రోల్ ధర రూ. 100 దాటి, రవాణా ఖర్చులు పెరిగి సామాన్యులపై భారం పెరిగిందని వామపక్ష పార్టీల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.
దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తున్న ఈ తరుణంలో ప్రజల ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయన్నారు. సామాన్యుల జీవితాలు దుర్భరమయ్యాయని.. ఇటువంటి సమయంలో ప్రజలను ఆదుకునేందుకు కేంద్రం ఏం చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విపత్కర సమయంలో మందులను బ్లాక్ మార్కెట్ చేస్తున్న వారిని అరికట్టడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. వెంటనే పెంచిన పెట్రో ధరలు ఉపసంహరించకపోతే.. ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.