వందల ఎకరాల భూములు ఆక్రమణదారుల చెరలో ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా ఈ సమస్య కొనసాగుతోంది. వాటి తొలగింపు, ప్రభుత్వ భూముల పరిరక్షణ రెవెన్యూ యంత్రాంగానికి సవాలుగా మారుతోంది. అలా కాలం గడిచిపోతోంది. కొన్ని నెలల క్రితం రాష్ట్ర పాలనా రాజధానిగా విశాఖను ప్రభుత్వం ప్రకటించడం, నగరం నుంచి భీమిలికి వెళ్లే ప్రాంతంలో పాలన రాజధాని వస్తుందన్న ఊహాగానాలతో భూములకు విపరీతమైన ధర పెరిగింది. కొవిడ్ పరిస్థితులున్నా ఈ ప్రాంతంలో జరుగుతున్న రిజిస్ట్రేషన్ల సంఖ్యలు ఆశ్చర్య పరుస్తున్నాయి. ఇదే సమయంలో ఆక్రమణదారులు అదును చూసి ప్రభుత్వ స్థలాలను కైవసం చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. రెవెన్యూ యంత్రాంగం కొవిడ్ విధుల్లో నిమగ్నమయింది. దీనినీ అవకాశంగా మార్చుకొని రెచ్చిపోతున్నారు. ఇప్పటికీ కొన్ని భూముల వ్యవహారాలపై దిగువ స్థాయి కోర్టుల నుంచి హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు ఎన్నో కేసులు నడుస్తున్నాయి.
భూముల పరిరక్షణ, ఆక్రమణలు, కోర్టు కేసుల వ్యవహారాలపై రెండు నెలల క్రితం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కురసాల కన్నబాబు, జిల్లా మంత్రి ఎం.శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డిలు కలెక్టరేట్‌లో సమీక్షించారు. యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అయినా నిత్యం ఏదొక చోట ఆక్రమణలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. కొంత వరకు రెవెన్యూ అధికారులు తొలగిస్తున్నా పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి.
పీఎం పాలెం: శారదానగర్‌లో కొండను తొలిచి చదును చేసిన దాదాపు 200 గజాల ప్రభుత్వ స్థలంలో మంగళవారం రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డు
* విశాఖలో జరిగిన భూ కబ్జాలను నిగ్గుతేల్చేందుకు గత ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను 2017లో ఏర్పాటు చేసింది. వేల ఎకరాలు కబ్జాకు గురైనట్లు తేలింది. కొంతమందిని గతంలో అరెస్టు చేశారు. తదుపరి ‘సిట్’ నివేదిక వెలుగు చూడలేదు.ఆక్రమణల్లో ఉన్న భూములను స్వాధీనం చేసుకొనే ప్రక్రియ ఇంకా మొదలుకాలేదు.
* తొలి ‘సిట్’ నివేదిక ఆధారంగా సీనియర్ ఐఏఎస్ అధికారి విజయకుమార్ ఆధ్వర్యంలో గత ఏడాది అక్టోబర్‌లో వైకాపా ప్రభుత్వం మరో సిట్‌ను వేసింది. నాలుగు నెలల పాటు విచారణ చేసి ప్రాథమిక నివేదికను అందజేసింది. తదుపరి సిట్ కాలపరిమితిని పొడిగించారు. కరోనా నేపథ్యంలో విచారణ ఆగిపోయింది. రెండోసారి ఇచ్చిన గడువు ముగిసింది. కబ్జాల లెక్కలు నిగ్గుతేలలేదు. బాధ్యులపై చర్యలు లేవు. మళ్లీ ఆక్రమణల పర్వం కొనసాగుతోంది.
* నకిలీ ద్రువీకరణ పత్రాలతో మాజీ సైనికుల పేరుతో ఎన్‌వోసీలు పొంది ప్రభుత్వ భూముల్లో పాగా వేసిన వారు సైతం తాజాగా ఆయా స్థలాల్లో షెడ్డులు, ఇతర నిర్మాణాలు చేపడుతున్నారు. ఇటువంటివి మధురవాడ ప్రాంతంలో జోరుగా సాగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇవి సిట్ పరిధిలో ఉన్నప్పటికీ ఆయా పనులు కొనసాగించడం గమనార్హం.