AP CINEMA STUDIOS: రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, రాయలసీమలో సినీ పరిశ్రమ కోసం భూసేకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సినిమా షూటింగులు, సినిమా స్టూడియోల నిర్మాణం కోసం ఈ భూములను వినియోగించనున్నారు. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఇందుకోసం ప్రత్యేకంగా భూనిధి ఏర్పాటు చేయాలని సంబంధిత జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం. ఈ భూములను చలనచిత్ర అభివృద్ధి సంస్థకు అప్పగించి ఆ సంస్థ ద్వారానే అభివృద్ధి చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. భూసేకరణ పూర్తయ్యాక స్టూడియోల నిర్మాణానికి రెండు విధానాలు అనుసరించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. నిర్మాణం-నిర్వహణ-బదిలీ (బీఓటీ)విధానంలో స్టూడియోలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లను ఆహ్వానించాలని నిర్ణయించింది. మరోవైపు ప్రైవేటుగా స్టూడియోలు నిర్మించడానికి ముందుకు వచ్చే వారికి భూమి కేటాయించాలని నిర్ణయించినట్లు సమాచారం.
టికెట్ల ధరలపై త్వరలో ఉన్నతస్థాయి కమిటీ సమావేశం
సినిమా టికెట్ల ధరలు తదితరాలపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఉన్నతస్థాయి కమిటీ ఈ నెల 14తర్వాత చివరిసారిగా సమావేశం కానుంది. ఈ భేటీలో నివేదికను ఖరారు చేయనుంది. ఆ నివేదిక ఆధారంగా ఈ నెలాఖరులో జీవోలను వెలువరించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. థియేటర్లలో రోజుకు 5 ఆటలను ఉదయం 6నుంచి రాత్రి 12లోపు ప్రదర్శించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం 8గంటలకు మొదటిది రాత్రి 8 గంటలకు చివరి ఆట ప్రారంభించాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.