ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వెయ్యి రోజులైనా ఉక్కు సంకల్పమే.. 500వ రోజుకు చేరిన ఆందోళన..

Steel Agitation @ 500 days: పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు కోసం.. మళ్లీ తెగించే పరిస్థితి తీసుకురావొద్దంటూ కార్మికులు హెచ్చరించారు. ఇక నుంచి ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని.. ఉద్యమం 500వ రోజున అంతా ఏకమై ప్రకటించారు. ప్రైవేటీకరణ నిర్ణయంపై.. సీఎంతోపాటు ప్రధానిపై ఒత్తిడి తెచ్చేలా పోరాడతామని స్పష్టం చేశారు.

vsp fight
vsp fight

By

Published : Jun 26, 2022, 5:23 PM IST

Updated : Jun 27, 2022, 4:00 AM IST

Visakha Steel Plant Agitation: స్టీల్‌ప్లాంటును కాపాడుకునేందుకు ఎంతటి త్యాగాలకైనా సిద్ధమని, ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు స్పష్టం చేశారు. ఉక్కు పరిశ్రమ రక్షణకు 500 రోజులు కాదు.. వెయ్యి రోజులైనా పోరాడేందుకు సిద్ధమని ప్రకటించారు. ఉద్యమిస్తున్న కార్మికులకు అన్ని వర్గాలతోపాటు సామాన్యులు అండగా నిలుస్తున్నారని వివరించారు. ప్రైవేటీకరణపై కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేంత వరకూ పోరాటం ఆగబోదన్నారు. లాఠీలు, తూటాలతో బెదిరింపులు, తప్పుడు కేసులు పెట్టినా వెనకడుగు వేసేది లేదని తెలిపారు. స్టీల్‌ప్లాంటు పరిరక్షణ ఉద్యమానికి ఆదివారంనాటికి 500 రోజులు పూర్తయిన సందర్భంగా విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ - విశాఖ జిల్లా కార్మిక, ప్రజాసంఘాల ఐకాస ఆధ్వర్యంలో మహా ప్రదర్శన, సభ నిర్వహించారు.

అంతకుముందు ఉక్కు ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు కూర్మన్నపాలెం నుంచి ద్విచక్రవాహనాలపై ర్యాలీగా దొండపర్తి డీఆర్‌ఎం కార్యాలయం వద్దకు చేరుకున్నారు. జోరు వాన కురిసినప్పటికీ అధిక సంఖ్యలో కార్మికులు హాజరయ్యారు. ఆందోళనలో 22 కార్మిక సంఘాలతోపాటు పోర్టు, హెచ్‌పీసీఎల్‌, ఎల్‌ఐసీ, డాక్‌యార్డు, బ్యాంకు ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం సభలో నాయకులు మాట్లాడారు. లక్షల మందికి అన్యాయం జరుగుతుంటే ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారని స్టీల్‌ప్లాంటు పరిరక్షణ పోరాట కమిటీ ఛైర్మన్‌ ఆదినారాయణ ప్రశ్నించారు.

ప్లాంటు విక్రయించేందుకు కేంద్రం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సమష్టిగా అడ్డుకుంటున్నామని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు నరసింగరావు అన్నారు. అల్లూరి 125వ జయంత్యుత్సవాల్లో పాల్గొనేందుకు జులై 4న ప్రధాని మోదీ విశాఖకు వస్తారని అంటున్నారని, ఆయన్ను అడ్డుకుంటామని పేర్కొన్నారు. ఆయన రాకను నిరసిస్తూ ప్రతి ఇంటి ముందు నల్లజెండాలు ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు, ఐఎన్‌టీయూసీ కార్యదర్శి మంత్రి రాజశేఖర్‌, వైఎస్సార్‌టీయూసీ, టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు గౌతంరెడ్డి, రఘురామరాజు, నాయకులు పాల్గొన్నారు.

ఉద్యమం ఆగదు.. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించబోమని కేంద్రం ప్రకటించేవరకు ఉద్యమం ఆగబోదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ స్పష్టం చేశారు. కార్మికుల ఉద్యమం 500వ రోజుకు చేరిన సందర్భంగా ఆదివారం విజయవాడలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. దేశ చరిత్రలో సుదీర్ఘ కార్మిక పోరాటంగా ఈ ఉద్యమం నిలుస్తుందని రామకృష్ణ పేర్కొన్నారు. ర్యాలీలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు దోనేపూడి శంకర్‌, వనజ తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:

Last Updated : Jun 27, 2022, 4:00 AM IST

ABOUT THE AUTHOR

...view details