ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తక్కువ ముళ్లు... ఎక్కువ రుచి... ఉప్పు నీటిలో పెరిగే అప్పలు చేప - జాన్స్‌ స్నాపర్ చేపల వార్తలు

ఉప్పునీటి చెరువుల్లో పెంచడానికి వీలుగా మరో జాతి చేపలు సిద్ధమయ్యాయి. గత మూడున్నర ఏళ్లుగా విశాఖలోని సముద్ర మత్స్య పరిశోధన కేంద్ర సంస్థ (సి.ఎం.ఎఫ్‌.ఆర్‌.ఐ) శాస్త్రవేత్తలు అప్పలు అనే రకం చేపలను విజయవంతంగా అభివృద్ధి చేశారు. త్వరలో వాటిని ఉప్పునీటి చెరువుల్లో పెంచడానికి వీలుగా అందుబాటులోకి తేనున్నారు.

john snapper fishes is ready to be raised in saltwater ponds in visakha
ఉప్పు నీటిలో పెంచేందుకు అప్పల చేపలు సిద్ధం

By

Published : Nov 30, 2020, 12:31 PM IST

రైతులకు లాభసాటైన చేపల రకాలను అందుబాటులోకి తెచ్చే విశాఖలోని సి.ఎం.ఎఫ్‌.ఆర్‌.ఐ. తాజాగా అప్పలు (జాన్స్‌ స్నాపర్‌) అనే రకం చేపలను కృత్రిమ వాతావరణంలో అభివృద్ధి చేసింది.

మార్కెట్లో మంచి గిరాకీ...

'అప్పలు' జాతి చేపలు సముద్ర అంతర్భాగాల్లో రాళ్ల మధ్య కాలం గడుపుతుంటాయి. వేటకు వెళ్లే వారికి అవి చాలా తక్కువగా దొరుకుతాయి. తక్కువ ముళ్లు, ఎక్కువ రుచితో ఉండే ఈ రకం చేపలకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. కిలో రూ.400 నుంచి రూ.450వరకు ధర పలుకుతోంది. వీటిని ప్రయోగాత్మకంగా సేకరించి పెంపకం చేపట్టారు.

శాస్త్రవేత్తలు సుమారు 10నెలలపాటు శ్రమించి సుమారు 20కు పైగా ఆడ, మగ 'అప్పలు' జాతి చేపల్ని సముద్రం నుంచి తీసుకొచ్చి నీటితొట్టెల్లో ఉంచారు. ఈ పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు డాక్టర్‌ రితేశ్‌ రంజన్, డాక్టర్‌ శేఖర్‌ మేగరాజన్, డాక్టర్‌ బిజి జేవియర్, డాక్టర్‌ శుభదీప్‌ఘోశ్‌లు ఇందులో భాగస్వాములయ్యారు. 15శాతానికి మించి పి.పి.టి.(పార్ట్స్‌ పర్‌ థౌసెండ్‌) ఉప్పదనం ఉన్న సముద్ర నీటిలో అవి బాగా పెరుగుతున్నట్లు తేల్చారు. చేపలకు హార్మోన్‌ ఇంజక్షన్లు ఇచ్చి ఆడ, మగ చేపలు పరస్పరం ఆకర్షితులయ్యేలా చేశారు. 'అప్పలు' జాతి ఆడ చేపలు గుడ్లు పెట్టేలా చేయడంలో విజయం సాధించారు. ఆయా గుడ్లను వేరుచేసి అవి పిల్లలుగా ఎదగడానికి అనువైన వాతావరణాన్ని ప్రయోగశాలలోని హేచరీలో అభివృద్ధి చేశారు.

రీసైక్లింగ్ వ్యవస్థ ఏర్పాటు..

అప్పలు చేపపిల్లల్ని కృత్రిమంగా పెంచడానికి వీలుగా పరిశోధనశాల ప్రాంగణంలో హేచరీని, రీసైక్లింగ్‌ ఆక్వాకల్చర్‌ సిస్టంను ఏర్పాటుచేశారు. పిల్లల ఎదుగుదలను నిత్యం పరిశీలించడానికి వీలుగా ప్రత్యేకంగా ఒక నర్సరీ రీసైక్లింగ్‌ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. ఆ వ్యవస్థలోని భారీ ప్లాస్టిక్‌ ట్యాంకుల్లో ఉండే ఆయా చేపపిల్లలకు అవసరమైన ఆహారం, స్వచ్ఛమైన నీరు, తగినంత ఆక్సిజన్‌ ఎప్పటికప్పుడు అందేలా ఏర్పాట్లు చేశారు. శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన పరిజ్ఞానాలు ఫలించడంతో సుమారు 20వేల వరకు చేపపిల్లలు బతికాయి. రెండునెలల నుంచి అవి బతికుండడంతో ప్రయోగం విజయవంతమైనట్లు నిర్ధరించుకున్నారు. సంవత్సరం వ్యవధిలో అవి కేజీకిపైగా బరువు పెరుగుతాయని భావిస్తున్నారు. ఒక్కోచేప మూడు నుంచి మూడున్నర కేజీల బరువు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.

డాక్టర్‌ శుభదీప్‌ఘోశ్

ఇదీ చదవండి:

పర్యావరణహితంగా రుషికొండ సాగర తీరం

ABOUT THE AUTHOR

...view details