విశాఖలో ఉద్యోగాల పేరుతో 150 మందికిపైగా నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టిన పాత నేరస్తుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకి చెందిన కిలపర్తి సందర్శ్(33) విశాఖ నగరంలోని డైమండ్ పార్కు సమీపంలోని ఒక భవనంలో ‘సాన్ నెక్స్ జనరేషన్ ఎలక్ట్రానిక్ టెక్నాలజీ (ఎస్‌ఎన్‌జీఈటీ) పేరిట ఒక నకిలీ సంస్థను లాక్‌డౌన్‌కు ముందు స్థాపించాడు. ఎలక్ట్రానిక్ పరికరాలు, సెన్సార్ ట్యాప్స్, శానిటైజేషన్ యంత్రాలు, సీసీ కెమెరాలు తయారు చేస్తున్నట్లు నమ్మించాడు. సంస్థకు తాను సీఈవోగా పేర్కొంటూ ఆన్‌లైన్‌లో ప్రాంగణ నియామకాల పేరిట యువతకు వల వేశాడు. బెంగళూర్‌లో శిక్షణ ఉంటుందని, రూ. 10 వేలు ఖర్చవుతుందని చెప్పాడు. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు తుని, హైదరాబాద్ ప్రాంతాలకు చెందిన 175 మంది నుంచి నగదు వసూలు చేశాడు.
ఒక్కొక్కరి నుంచి.. లక్షన్నర వసూలు
కొందరిని పరికరాల తయారీ వైపు, మరికొందరిని మార్కెటింగ్ వైపు నియమించాడు. అయితే కొద్ది సరకు మాత్రమే అందుబాటులో ఉంచి దాంతోనే లావాదేవీలు నిర్వహించమనేవాడు. తాము వాటిని విక్రయించలేకపోతున్నామని 30 మంది పేర్కొనగా...ఒక్కొక్కరు రూ.1.50 లక్షల చొప్పున పెట్టుబడి పెడితే సంస్థలో భాగస్వామ్యం కావొచ్చని చెప్పి వారి నుంచి ఆ సొమ్ము గుంజాడు. పని చేస్తున్న వారికి ఇప్పటికీ వేతనాలు ఇవ్వకపోవడంతో పలువురిలో అనుమానాలు తలెత్తాయి. రూ.1.50 లక్షల చొప్పున ఇచ్చిన వారు కార్యాలయానికి వచ్చి తమ నగదు తిరిగి ఇచ్చేయాలని గట్టిగా డిమాండ్ చేయడంతో కొన్ని రోజులుగా తప్పించుకు తిరుగుతున్నాడు.