'జవాద్' తుపాను ముప్పు ముంచుకొస్తుంది. అప్రమత్తమైన విశాక నౌకాదళ సిబ్బంది.. తుపాను సహాయ చర్యలకు సన్నద్ధమయ్యారు. అధికారులకు సాయంగా నౌకాదళం బృందాలను ఏర్పాటు చేసింది. 13 వరద సహాయ బృందాలు, డైవింగ్ నిపుణులతో సిద్ధంగా ఉన్నట్లు నౌకాదళ అధికారులు వెల్లడించారు. 3 వరద సహాయ, 2 డైవింగ్ బృందాలు ఒడిశా పంపామన్నారు. ఆంధ్ర, ఒడిశా తీరంలో సాయం చేసేందుకు 4 నౌకలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఏరియల్ సర్వే, నిత్యావసరాల సరఫరాకు విమానం సిద్ధం చేశామని వెల్లడించారు. తుపాను దృష్ట్యా 'విక్టరీ ఎట్ సీ' వద్ద రేపటి కార్యక్రమం రద్దు చేసినట్లు నౌకాదళ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
విశాఖలో కంట్రోల్ రూమ్‌లు..
విశాఖపట్నం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా విశాఖ కంట్రోల్ రూమ్ నెంబర్లు.. 0891-2590100, 2590102, 2750089, 2750090, 2560820కు ఫోన్ చేయాలని సూచించారు. జీవీఎంసీ, రెవెన్యూ, జలవనరుల శాఖ సిబ్బంది, పోలీసులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ మల్లికార్జున సూచించారు. తుపాను ప్రభావం దృష్ట్యా 3 రోజులు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. విపత్తును ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బంది సిద్ధంగా ఉండాలన్నారు.
ఉప్పాడ తీరంలో ఎగిసిపడుతున్న కెరటాలు
తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ తీరంలో జవాద్ తుపాను ప్రభావం మెుదలైంది. తీరంలో కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. కెరటాల ధాటికి తీరంలోని మత్య్సకారుల ఇళ్లు కోతకు గురవుతున్నాయి.
తుపానుపై సీఎం సమీక్ష..
జవాద్ తుపానుపై కలెక్టర్లతో ముఖ్యమంత్రి జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సీఎం సమీక్ష జరిపారు. తుపాను వల్ల ఎక్కడా ప్రాణనష్టం ఉండకూడదని అధికారులను ఆదేశించారు. తక్షిణ సహాయ చర్యలకు జిల్లాకు రూ.10 కోట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. సహాయ చర్యల్లో ఏ లోపం ఉండకూడదన్న సీఎం..సహాయ శిబిరాల్లో ఆహారం, తాగునీరు, ఇతర వసతులు కల్పించాలన్నారు. అన్ని జిల్లాల్లో ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ ఉండాలని..,ముంపు ప్రాంతాలను గుర్తించి అక్కడి ప్రజలను తరలించాలని సూచించారు. చెరువులు, కాలువలు, రిజర్వాయర్ల కట్టలను పరిశీలించాలన్నారు. గట్లు బలహీనంగా ఉంటే జలవనరులశాఖ అధికారులకు చెప్పాలని..,ఆయా చోట్ల వెంటనే అత్యవసర మరమ్మతులు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలన్నారు.
ఇదీ చదవండి
Weather Update: ముంచుకొస్తున్న 'జవాద్' ముప్పు.. తుపానుగా మారిన తీవ్ర వాయుగుండం