విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న కార్మికులు, నిర్వాసితుల నిరసనలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంఘీభావం ప్రకటించారు. ఈ మేరకు విశాఖలో తలపెట్టిన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్... నాయకుడు, కవి ఎప్పుడూ కార్మికులవైపు నిలబడాలన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమ నేతలకు అభినందనలు తెలిపారు. దేశ ప్రగతికి ఉక్కు కర్మాగారాలు చాలా ముఖ్యమన్న పవన్ కల్యాణ్.. విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు నినాదం.. అందరిలో భావోద్వేగం నింపిందని వ్యాఖ్యానించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ వచ్చేందుకు ఎందరో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ఉక్కు పరిశ్రమ రావడంలో ఏయూ విద్యార్థుల పాత్ర కూడా ఉందన్న ఆయన.. ఉక్కు ఉద్యమంలో ఆనాడు పోలీసు కాల్పుల్లో 32 మంది చనిపోయారని చెప్పారు. ఎందరో పోరాటం చేస్తేనే విశాఖ ఉక్కు పరిశ్రమ ఇక్కడకు వచ్చిందన్నారు.
'ఉక్కు పరిశ్రమ నిర్వాసితులకు ఇప్పటికీ పరిహారం అందలేదు. భూమి కోల్పోయిన నిర్వాసితులు అనేక కష్టాలు పడుతున్నారు. ప్రభుత్వరంగ పరిశ్రమలు అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటా. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వద్దని అమిత్‌షాను కోరాం. నా వెనుక ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరూ లేరు. ప్రజాబలం ఉందనే నాకు ఎవరైనా అపాయింట్‌మెంట్ ఇస్తారు.అన్నింటికీ ఉన్నట్లే విశాఖ ఉక్కు పరిశ్రమకూ నష్టాలు ఉన్నాయి. వైకాపా రాజకీయ పరిశ్రమకు తప్ప అన్నింటికీ నష్టాలు ఉన్నాయి' - పవన్ కల్యాణ్, జనసేన అధినేత
అండగా ఉండండి: పవన్