విశాఖపట్నం విమానాశ్రయాన్ని మూసివేయాలంటూ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కేంద్ర పౌర విమానయాన శాఖకు లేఖ రాయడం పట్ల జనసేన పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై విశాఖలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శులు తమ్మిరెడ్డి శివశంకరరావు, బొలిశెట్టి సత్యనారాయణ మాట్లాడారు.
భోగాపురం విమానాశ్రయం ప్రారంభమైన తర్వాత 30 సంవత్సరాల పాటు విశాఖ విమానాశ్రయాన్ని మూసివేయాలని విజయసాయిరెడ్డి లేఖ రాయడం పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. విశాఖ ప్రజల ఆకాంక్షలు, ప్రయోజనాలను దెబ్బతీసే ఈ ప్రయత్నాన్ని జనసేన తిప్పి కొడుతుందన్నారు. ఆయన తన లేఖను ఉపసంహరించకుంటే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని చేపట్టి విశాఖ ప్రజల ప్రయోజనాన్ని పరిరక్షించేందుకు వెనుకాడబోమని వారు స్పష్టం చేశారు. విశాఖ జనాభా 60 లక్షలకు చేరుతున్న సందర్భంలో విశాఖ, భోగాపురం విమానాశ్రయాలు రెండూ అవసరమేనని అన్నారు. రానున్న కాలంలో విశాఖ నుంచి పెద్ద ఎత్తున సరకు రవాణా అయ్యే అవకాశాలున్నాయని, ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి ఈ రకమైన లేఖలు రాయడం ప్రజా వ్యతిరేకమని వారు మండిపడ్డారు.