Daspalla lands issue: విశాఖలోని దసపల్లా భూములను వైకాపా నాయకులు కాజేయాలని చూస్తున్నారని తెదేపా నేతలు నిరసన చేపట్టారు. విశాఖ సర్క్యూట్ హౌస్ నుంచి దసపల్లా భూముల వరకు తెదేపా నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. వైకాపా నేతలు 22ఎలో ఉన్న ప్రభుత్వ భూములను తమ సొంతం చేసుకోవాలని చూస్తున్నారని తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఐదు వేల కోట్ల విలువచేసే ప్రభుత్వ భూములపై వైకాపా పెద్దలు కన్నేశారని ఆరోపించారు. వారి నుంచి భూములను కాపాడాలంటూ పేర్కొన్నారు. సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాత్రికి రాత్రి నిబంధనలు మార్చి దసపల్లా భూములను ఆక్రమించుకోవాలని చూస్తున్నారని, ఆ భూములు ముమ్మాటికీ ప్రజల ఆస్తి అని వెల్లడించారు. భూముల పరిరక్షణకు తెదేపా కట్టుబడి ఉందని ఆ పార్టీ నేతలు అన్నారు.
దసపల్లా భూములపై జనసేన కార్పొరేటర్ మీడియా సమావేశం జనసేన ఆధ్వర్యంలో..:విశాఖ దసపల్లా భూములు వ్యవహారంలో విజయసాయిరెడ్డి బంధువులే అక్రమాలు చేశారంటూ.. జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. విశాఖ పరిపాలన రాజధాని పేరు చెప్పి ఇక్కడి భూములను కొట్టేస్తున్నారని అన్నారు. ఎక్కడ భూమి కబ్జాకు గురైన క్రిమినల్ కేసులు నమోదు చేయమని అధికారులకు చెప్పిన విజయసాయిరెడ్డిపై ఇప్పుడు ఏ కేసు పెట్టాని ప్రశ్నించారు. దసపల్లా భూములుపై ఈడీ విచారణ జరగాలని డిమాండ్ చేశారు.
విశాఖలో అధికార పార్టీ పెద్దలే భూములను ఆక్రమిస్తున్నారని జనసేన రాష్ట్ర నాయకురాలు పసుపులేటి ఉషాకిరణ్ ఆరోపించారు. అందుకోసమే విశాఖని పరిపాలన రాజధానిగా చేస్తున్నారని విమర్శించారు. విశాఖ భూములు భవిష్యత్ తరాలవని తెలిపారు. వాటిని అప్పణంగా కాజేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ అంశాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టి తీసుకెళ్తామని తెలిపారు.
ఇవీ చదవండి: